ప్రజాశక్తి -కొమరాడ : ప్రభుత్వ భూములు, చెరువులో అక్రమ కట్టడాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఒకవైపున చర్యలు తీసుకుంటున్నా మరో వైపున అక్రమారులు యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తునే ఉన్నారు. ఇందుకు నిదర్శనం కొమరాడ మండల కేంద్రంలో చేపడుతున్న అక్రమ నిర్మాణం.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపాన గల అంతర్‌రాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న ప్రదేశంలో తనకు జిరాయితీ భూమిగా ఉందని చెప్పి ఒక ఆసామి ఏకంగా రెండంతస్తుల భవనం కట్టి సుమారు 18 దుకాణాలతో పక్కా భవనం నిర్మించారు. దీంతో స్థానిక సర్పంచ్, ఎంపిటిసి సభ్యులు ఇది ఆర్‌ఎంబి స్థలమని, పక్కా భవనాలు నిర్మించడం నిషేధమని, గతంలో చెప్పినప్పటికీ అవేమీ పట్టించకుండా అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ సిరికి గంగమ్మ, ఎంపిటిసి సభ్యులు మరడాన అశ్విని తదితరులు అక్కడ నిర్మించిన ప్రైవేటు భవనం పూర్తిగా ప్రభుత్వ స్థలంలోనే కట్టడాలు కట్టారని నిర్ధారించుకొని జిల్లా కలెక్టర్‌కు, స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో సర్వేనెంబర్ 307/3 మూడ్లో ఆ ఆసామి భూమి ఉన్నప్పటికీ 308, 309 సర్వే నెంబర్లు 13 సెంట్లు ప్రభుత్వ స్థలంలో ఈ భవనం నిర్మాణం జరిగిందని ఫిర్యాదు చేయడంపై రెవెన్యూ అధికారులు దర్యాప్తు నిర్వహించి సర్వే చేశారు. ఈ సర్వేలో 13 సెంట్లు రెండు అంతస్తులు భవనం పూర్తిగా ప్రభుత్వ స్థలంలోనే నిర్మించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన యజమానికి 7 నోటీసును అందజేసినట్లు సమాచారం. దీంతో అక్రమ నిర్మాణాలు ప్రధాన రహదారిపై దర్జాగా కట్టడంపై స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ కట్టడాలు కట్టిన భవనాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై తహశీల్దార్ వద్ద ప్రస్తావించగా 308, 309 సర్వే నెంబర్లు 13 సెంట్లు ప్రభుత్వ రోడ్డు భవనాల శాఖ చెందిన ప్రదేశంలో భవనం నిర్మించినట్లు తెలిపారు. ఇప్పటికే నోటీసులు అందజేశామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వంలో ఎంత దర్జాగా కబ్జా చేసి ఏకంగా రెండంతస్తుల పక్కా భవనం నిర్మించడంపై మండల కేంద్రంలో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేస్తారా లేక ఏ విధమైన చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి.