ప్రజల కోసమే సమస్యల పరిష్కార వేదిక : మంత్రి

Sep 30,2024 21:11

సాలూరు: ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఆమెతో పాటు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌, ఐటిడిఎ ఇన్‌ఛార్జ్‌ పిఒ అశుతోష్‌ శ్రీవాస్తవ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామాల్లో గల ప్రజా సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కారానికి ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టరు ఎ.శ్యామ్‌ ప్రసాద్‌, మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్జీలు పెండింగ్‌ ఉండరాదని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 238 అర్జీలు ప్రజలు అందజేశారు. అలాగే పార్వతీపురంలోని కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ సోభిక ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అన్నిశాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కమిషనర్‌పై మంత్రి అసంతృప్తి స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌గా విహెచ్‌.సత్యనారాయణ నియామకంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు కమిషనర్‌ సత్యనారాయణ హాజరయ్యారు. పట్టణ సమస్యలపై వినతులు వచ్చినప్పుడు కమిషనర్‌ను కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పిలవగా సత్యనారాయణ లేచి నిలబడ్డారు. ఇంకొకరి సాయం ఉంటే గానీ నడవలేని స్థితిలో ఉన్న కమిషనర్‌ సత్యనారాయణను చూసి జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, మంత్రి సంధ్యారాణి అవాక్కయ్యారు. కమిషనర్‌ను సరెండర్‌ చేయాలని మంత్రి సంధ్యారాణి జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. అస్తవ్యస్తంగా ఉన్న మున్సిపాలిటీని చక్కదిద్దాలంటే యువకుడైన అధికారిని నియమించాలని కోరితే ఊతలేకుండా నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని ఎలా నియమిస్తారని మంత్రి సంధ్యారాణి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం మున్సిపాలిటీ అభివృద్ధి పై జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ సమీక్ష నిర్వహించిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. యువకుడైన కమిషనర్‌ను నియమించాలని మున్సిపల్‌ ఉన్నతాధికారిని కోరుతానని కలెక్టర్‌ చెప్పారు. అయితే అటు మంత్రి సంధ్యారాణి, ఇటు జిల్లా కలెక్టర్‌ అభీష్టానికి వ్యతిరేకంగా మున్సిపల్‌ కమిషనర్‌ను నియమించడం చర్చనీయాంశమవుతోంది.మండలానికో రోజు గ్రీవెన్స్‌ సెల్‌ : సంధ్యారాణి తన నియోజకవర్గంలో మండలానికో రోజు గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించనున్నట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక అనంతరం కలెక్టర్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై గడిచిన ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అందుకే ప్రజలు ఇప్పుడు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందజేస్తున్నారని చెప్పారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గ పరిధిలోని ఒక్కో మండలంలో ఒక్కో రోజు గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.వైటిసి సిబ్బంది జీతాలు ఇప్పించండివైటిసిలో పని చేస్తున్న సిబ్బందికి 42నెలల జీతాలు బకాయి వుందని, గర్భిణీ స్త్రీల వసతి గృహం లో పనిచేస్తున్న సిబ్బందికి 25నెలల జీతాలు బకాయి వుందని, కొన్ని నెలలైనా మంజూరు చేయాలని కోరుతూ వైటిసి మేనేజర్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యాన సిబ్బంది మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని మంత్రి సిబ్బందికి సూచించారు.

➡️