సాదాసీదాగా ఏకలవ్య పాఠశాల

Oct 28,2024 21:30

భామిని: గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతిలో ఉన్నతంగా విద్యను అందించాలని ఐదేళ్ల క్రితం రూ.12 కోట్లతో ఏకలవ్య పాఠశాలను ప్రారంభించారు. ఈ భవన నిర్మాణం ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పూర్తి కాలేదు. ఐదేళ్లుగా ఈ పాఠశాల విద్యార్థులకు కొత్తూరు పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 6 నుండి ఇంటర్‌ వరకు 420 మంది విద్యార్థులు ఉన్నారు. కొత్తూరు పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌లో వసతి, తరగతులు నిర్వహణ ఇబ్బందికరంగా ఉండడం, అరకొర వసతుల మధ్య విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో భామినిలో ఏకలవ్య పాఠశాలను సోమవారం ప్రారంభించారు. అయితే ఇక్కడ తరగతుల గదులు, వంట నిర్వహణ గదులు మినహాయించి మిగిలినవి నిర్మాణంలో జరుగుతున్నాయి. పాఠశాలలో రూ.40 లక్షలతో మొదలు పెట్టిన సిసి రోడ్డు కూడా పూర్తి కాలేదు. రూ.12 కోట్లతో నిర్మించిన పాఠశాల అట్టహాసంగా, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రారంభించాల్సి ఉంది. నిరాడంబరంగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతితో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ పాఠశాలను మంజూరు చేయగా, అధికారుల నిర్లక్ష్యం వల్ల అమలుకు నోచుకోవడంలేదన్న అంశానికి ఈ పాఠశాల అద్దం పడుతుంది.

➡️