ప్రజాశక్తి-కొమరాడ : మండలంలోని గుమడ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై లారీ ఢకొీని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. గుమడ గ్రామానికి చెందిన దేవుపల్లి భాస్కరరావు (28) పశువులు తోలుకెళ్తున్నాడు. విశాఖపట్నం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీ ఆయన్ను ఢకొీనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లారీ నిలుపుదల చేయకుండా డ్రైవర్ అతి వేగంగా ముందుకు వెళ్లిపోయాడు. పోలీసులు స్పందించి కొమరాడ గ్రామ సమీపంలో లారీని అడ్డగించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన గుమడ గ్రామస్తులు, భాస్కరరావు కుటుంబ సభ్యులు అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. ఈ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వాహన తనిఖీలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తరలించబోమని తేల్చిచెప్పారు. సుమారు మూడు గంటల పాటు రెండు వైపులా రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ నీలకంఠం ఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు ససేమీరా అనడంతో పార్వతీపురం సిఐ ఎస్.గోవిందరావు.. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి లారీ యజమాని నుంచి నష్టపరిహారం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.