పార్వతీపురం టౌన్ : పెండింగ్ కేసులను రాజీ చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ, బార్ అసోసియేషన్ సభ్యులను, లాయర్లకు రెండో అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు ఎస్.దామోదరరావు సూచించారు. మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి తీసుకునే చర్యలపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రెండో అదనపు జిల్లా జడ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు అధిక మొత్తంలో రాజీ కుదిర్చేలా కృషి చేయాలని తెలిపారు. కోర్టులో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉండడం వల్ల కక్షిదారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జడ్జి అన్నారు. రాజీ చేయడం ద్వారా కక్షిదారులకు శ్రమ, ఖర్చుల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్ఫిన్, పట్టణ, రూరల్, గరుగుబిల్లి ఎస్‌ఐలు గోవింద, సంతోషి కుమారి, రమేష్ నాయుడు, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రేవతమ్మ, హెడ్ కానిస్టేబుళ్లు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.శ్రీనివాసరావు, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొర్లె వెంకటరావు, లాయర్ ఎం.వెంకటరావు, ఎన్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.మార్చి 8న జాతీయ లోక్ అదాలత్‌మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు ఎస్.దామోదరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులు, సివిల్ కేసులు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌లో కేసులు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడం వల్ల శారీరక శ్రమ, అధిక ఖర్చు, కాలయాపన లేకుండా తీర్పును పొందవచ్చునని పేర్కొన్నారు. ప్రజలు, కక్షిదారులు ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను సత్వరంగా పరిష్కరించుకోవాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ సేవలు ఉచితంగా పొందవచ్చునని ఆ ప్రకటనలో తెలిపారు.