సీతంపేట: ఇసుక రీచ్‌ల వద్ద ఉన్న బ్రిడ్జిలు, తాగు నీటి పథకాలు వంటి నిర్మాణాలకు ఐదు వందల మీటర్ల పరిధి తర్వాతే మాత్రమే ఇసుక తవ్వాలని కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పిజిఆర్‌ఎస్) కార్యక్రమాన్ని స్థానిక ఐటిడిఎ ఎస్‌ఆర్‌శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తు అర్జీలు పోటెత్తాయి. 190 వరకు దరఖాస్తులు అందాయి. పాలకొండ మండలం నుండి పలువురు ఇసుకపై విజ్ఞాపనలు సమర్పించడంపై ఆయన స్పందిస్తూ నిబంధనలు మేరకు 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు జరపరాదని స్పష్టం చేశారు. అటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని, వాహనాలను సీజ్ చేయాలని ఆయన తహసీల్దార్లను ఆదేశించారు. మౌలిక సదుపాయాల పనులు మంజూరు చేసిన మూడు నెలలలో పూర్తి చేయాలని ఆయన అన్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలకు స్పందించి వెంటనే వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీతంపేట ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎపిఒ జి.చినబాబు, ఇపిడిసిఎల్ ఎస్‌ఇ కె చలపతిరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.