ఏజెన్సీ రహదార్లు నరకానికి నకళ్లు

Nov 5,2024 21:06

ప్రజాశక్తి – సీతంపేట: ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారలేదు. నేటికీ స్వాతంత్రం వచ్చి యాబై ఏళ్ల గడుస్తున్నా నేటి గిరిజన తండాల్లో కనీస వసతుల్లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. కనీసం రహదారి, తాగునీరు, గృహాలు లేకపోవడంతో గిరిజన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా మారింది. గిరిజన గ్రామాల్లో రహదారుల్లేవని, దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని పలుమార్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా, గ్రీవెన్స్‌లో వినతలు సమర్పించినా ప్రయోజనం కనిపించ లేదు.సీతంపేట ఐటిడిఎ పరిధిలో 20 సబ్‌ ప్లాన్‌ మండలాల పరిధిలోని 1200 గిరిజన గ్రామాలు ఉన్నాయి. సుమారు రెండు లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. సుమారు 100 గ్రామాలకు రోడ్లు లేవు. అధికారులు లెక్కలు ప్రకారం 70 రోడ్లు లేనట్లుగా గుర్తించినట్లు తెలుస్తుంది. రహదారుల్లేకపోవడం కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో అంబులెన్స్‌, అగ్నిమాపక శకటం, ప్రజా పంపిణీ వాహనం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండలంలోని మర్రిపాడు పంచాయతీలో ఎగువద్వార బంధం, నడిమిద్వార బంధం, దిగువ ద్వారా బంధం ఎత్తయిన కొండలపై ఈ గ్రామాలున్నాయి. ఈ గ్రామస్తులు రాళ్లు తేలిన రహదారిపై నడవలేని పరిస్థితి నెలకొంది. రంగంవలస రహదారి రాళ్లు తేలడంతో చుట్టుపక్కల రాళ్లపై డొంకలో కమ్మేయడంతో కనుచూపుమేర గ్రామానికి వెళ్లడానికి దారే కనిపించని దుస్థితి నెలకొంది. పెద్దగూడ, మూలగూడ, గుడిగుడ్డి, ఉసిరికపాడు వెళ్లే రోడ్లయితే ఇక చెప్పనవసరం లేదు. కిట్టలపాడు జంక్షన్‌ నుంచి కడగండి వరకు రహదారి పూర్తిగా మరమ్మతులకు గురి కావడంతో చుట్టుపక్కల 50 గ్రామాల వరకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి నిర్మాణం చేపడితే సీతంపేట, హిరమండలం, కొత్తూరు, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, ఐదు మండలాల వరకు ప్రయోజనం చేకూరుతుంది. మర్రిపాడు నుంచి పుతికవలస రహదారి మరమ్మతులకు గురైంది. దీంతో కుడ్డపల్లి నుంచి పెద్దకంబ, ముత్యాల జంక్షన్‌ నుండి కుమ్మర గండి మరమ్మతులు గురైంది .పివీ ఈతమానగూడ నుంచి గూడంగి గల ఆరుకిలోమీటర్లు, దిగువ పుట్టిగాం నుంచి ఎగువ పొట్టిగాం వరకు 3 కిలోమీటర్లు, నడిమి డుంబంగివలస నుంచి ఎగువ డుంమంది వలస వరకు మూడు కిలోమీటర్లు, రుక్మిణి గూడ రహదారి పాలకొండ మండలంలో సిరికొండ గూడ, భామిని మండలంలో ఇసుక గూడ నుంచి డోకులు గూడ కొత్త రహదారులు వేయాల్సి ఉంది. కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీలో చిన్నరాజపురం రహదారి అర్ధాంతరంగా వదిలేశారు. డెప్ఫిగూడ నుంచి దిగువ ముల్లుగూడ రోడ్డు సగం చేసి వదిలేశారు. అడ్డంగి నుంచి అబలసింగి రోడ్డు పూర్తికాలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️