ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తం

Feb 4,2025 21:35

ప్రజాశక్తి – మక్కువ : గ్రామాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక పిహెచ్‌సిలో మంగళవారం ఆశాడే, శంబర జాతర వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఆశాడేలో పాల్గొని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. మెరుగైన ఆరోగ్యం, రక్తహీనత నివారణకు పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన పెంపొందించాలని, తగు సూక్ష్మ పోషకాలు అవసరమని పేర్కొన్నారు. ఐరన్‌ లభించే ఆహారం ఎక్కువగా తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రం అందజేస్తున్న టిహెచ్‌ఆర్‌ గర్భిణీ, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రక్తహీనత గా గుర్తించిన కిశోర బాలికల్లో హీమోగ్లోబిన్‌ శాతం వృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఐరన్‌ ఫోలిక్‌ ఆసిడ్‌ మాత్రలు లభ్యంగా ఉండాలన్నారు. ఈనెల 10 నుంచి నిర్వహించనున్న డీవార్మింగ్‌ కార్యక్రమానికి తగు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఆశాలు, వైద్య సిబ్బంది ఆరోగ్య సర్వేలు పూర్తి స్థాయిలో నిర్వహించి సకాలంలో వ్యాధులను గుర్తించాలన్నారు. వాటర్‌, వెక్టార్‌ బోర్న్‌ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. తాగు నీటి స్వచ్చత పరీక్షలు గ్రామాల్లో నిర్వహించాలన్నారు. ప్రపంచ కేన్సర్‌ దినోత్సవం సందర్భంగా అక్కడ చేపట్టిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. కేన్సర్‌ స్క్రీనింగ్‌ ముందస్తుగా చేయాలని, తద్వారా వ్యాధి ముప్పు తప్పుతుందని తెలిపారు. కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచి, వైద్య శాఖ నిర్దేశించిన పరీక్షలు నిర్వహించి సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించాలన్నారు. అనంతరం డాక్టర్‌ జగన్మోహన్‌ శంబర జాతర సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని క్యూలైన్‌ వద్ద పరిశీలించారు. శిబిరాన్ని వినియోగించుకుంటున్న భక్తులు వారి ఆరోగ్య పరమైన సమస్యలు అందజేసిన చికిత్సా వివరాలు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మందులు, వైద్య పరీక్షలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ జి. హరికృష్ణ, డాక్టర్‌ ఎన్‌.కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ నిఖిల, ఎపిడెమిక్‌ ఇఒ సత్తిబాబు, సిహెచ్‌ఒ నిర్మల, సూపర్వైజర్లు రత్నం, జయగౌడ్‌ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

➡️