ప్రజాశక్తి గుమ్మలక్ష్మీపురం : అంతర పంటలతో అదనపు భూసారం వస్తుందని జట్టు ఫస్ట్ కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నూకం నాయుడు అన్నారు. మండలంలోని రాయగడ జమ్ము గ్రామంలో పువ్వుల ఆశమ్మ మామిడి తోటలో అంతర పంటలుగా వేసిన క్యారెట్, ముల్లంగి, పాలకూర, గోంగూర, మెంతి కూర, చిక్కుడు, టమాట, వంగ, మిరప, క్యాబేజీ పంటను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ నాబార్డు ఆర్ధిక సహకారంతో, జట్టు సంస్థ పర్యవేక్షణలో మండలంలోని 12 గ్రామాల్లో, 150 మంది రైతులతో పండ్ల తోటల్లో అంతర పంటలు వేయించామన్నారు. దేశి వరి విస్తీర్ణం పెంచడం, కిచెన్ గార్డెన్లు, ఏడాది పొడవునా పంటలు పండించే విధానం, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రైతులు ఆర్థికాభివృద్ధి చెందడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారన్నారు.అనంతరం రైతు ఆశమ్మ పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకోవడం వల్ల ప్రతిరోజు ఇంటి అవసరాలు తీర్చుకోవడంతో పాటు మిగిలిన పంటలను అమ్ముకుంటున్నారన్నారు. భూమిపై నిత్యం పంటలు ఉండడం వల్ల ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి . ప్రబోధ్, జి.మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
