ఆత్యం మైనింగ్‌ అరాచకాలు ఆపాలి

Mar 13,2025 21:00

 పార్వతీపురం: గరుగుబిల్లి మండలం, పెద్దగొడబ వద్ద గల ఆత్యం మైనింగ్‌ అరాచకాలు ఆపాలని, గతంలో దర్యాప్తు చేసిన నివేదికను బయటపెట్టి వెంటనే కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం పెద్దగొడబలో ఆత్యం మైనింగ్‌ కంపెనీకి అండగా 40మంది పోలీసులను పెట్టి ఎస్సైలు, సిఐలు కలిసి గ్రామస్తులపై దౌర్జన్యం చేశారని, గత నాలుగు రోజులుగా పెద్దగొడబ గ్రామస్తులు గ్రామంలో నుంచి భారీ వాహనాలు రావద్దని ఆందోళన చేస్తున్నారని చెప్పారు. దీనికి స్పందించి అత్యం మైనింగ్‌ కంపెనీకి అండగా పోలీసులు గురువారం పెదగొడబ గ్రామంపై దాడి చేసి నలుగురు రైతులను గరుగుబిల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లిపోవడం దుర్మార్గమన్నారు. పోలీసులు దౌర్జన్యం ఆపాలని, కలెక్టర్‌ జోక్యం చేసుకుని గ్రామస్తుల మొర వినిపించు కోవాలని కోరారు. పెద్ద ఎత్తున మహిళలు కలెక్టరేట్‌కు వచ్చారని తెలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడుతో పాటు సిపిఐ నాయుకులు తోట జీవ, గరుగుబిల్లి సూరయ్య వారికి మద్దతు తెలిపారు. అనంతరం మహిళలు ఐడిటిఎ పిఒ అశుతోష్‌ శ్రీ వాత్సవను కలిసి పెదగొడబలో పోలీసులు దౌర్జన్యం గురించి తెలిపారని చెప్పారు. అనేక రోజులుగా పెదగుడబ, చిన్నగుడబ, వల్లరి గుడబ గ్రామస్తులు ఆత్యం మైనింగ్‌ అరాచకాలు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాడుతుంటే దర్యాప్తునకు ఆదేశించిన జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వలేదని చెప్పారు. వెంటనే ఆ రిపోర్టు బయటపెట్టి ఆత్యం మైనింగ్‌ అరాచకాలు ఆపాలని, అక్రమంగా కబ్జా చేసిన భూములను, కొండలను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆత్యం మైనింగ్‌ అరాచకాలను ఆపకపోతే ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు.

➡️