ఆశా, సిహెచ్‌డబ్ల్యుల సమస్యలు పరిష్కరించాలి

Nov 5,2024 21:04

ప్రజాశక్తి – మక్కువ/సాలూరురూరల్‌ : ఆశా వర్కర్ల సమస్యలపై పభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని, అలాగే కమ్యూనిటీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు వి.ఇందిర, కోరాడ ఈశ్వరరావు నాయకత్వంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మక్కువ, సాలూరు మండలం మామిడిపల్లి, తోణాం, బాగువలస పిహెచ్‌సిల ఆందోళన చేసి, అనంతరం వైద్యాధికారులకు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌తో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చలు జరిపిందన్నారు. ఈ చర్చల్లో 60 నుంచి 62ఏళ్ల వరకు ఆశాల సర్వీసు పెంచుతామని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేస్తామని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా నేటికీ ఇచ్చిన మినిట్స్‌ను జీవోగా ఇవ్వలేదని అన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు రాష్ట్రంలో 2361 మంది గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వీరందర్నీ ఆశాలుగా గుర్తించి, వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రయాణం ఖర్చులు రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, గిరిజన ప్రాంతాల్లో ఎఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు ఎఎన్‌ఎంలుగా ప్రమోషన్‌ ఇవ్వాలని, గౌరవ వేతనాన్ని డైరెక్టరేట్‌ నుంచి ఆశాల ఖాతాల్లోకి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ,రమణమ్మ, మరియమ్మ , సిహెచ్‌ డబ్ల్యూ నాయకులు రమణమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

➡️