పరిష్కరించిన దరఖాస్తులు ఆడిట్‌

Jan 9,2025 21:29

 విజయనగరంకోట:  రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును తప్పనిసరిగా, సానుకూలంగా పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ తాహశీల్దార్లు పరిష్కరించిన ప్రతి దరఖాస్తును ఆడిట్‌ చేస్తామని చెప్పారు. సదస్సుల్లో మొత్తం 6846 దరఖాస్తులు రాగా, వీటిలో 4924 దరఖాస్తులు రెవెన్యూకు సంబంధించినవే అని చెప్పారు. ఈ దరఖాస్తులను పరిష్కరిస్తే జిల్లాలో రెవెన్యూ పరమైన సమస్యలన్నీ దాదాపు పరిష్కరించినట్టేనని తెలిపారు. కోర్టులనుంచి ప్రత్యేకంగా ఏమైనా ఆదేశాలు ఉన్నవి మినహా, వివాదాలు ఉన్న భూములను కూడా పరిష్కరించవచ్చునని సూచించారు. రీ సర్వే కోసం ప్రతీ మండలంలో ఎంపిక చేసిన పైలెట్‌ గ్రామాల సరిహద్దులు, ప్రభుత్వ భూముల హద్దులను ఈనెల 12లోగా ఖరారు చేయాలని ఆదేశించారు. ప్రీ హోల్డ్‌ భూముల వివరాల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసారు. ప్రతీ ఫైలు ఈ ఆఫీసులో మాత్రమే పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అంతకుముందు జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ మాట్లాడుతూ, పైలెట్‌ గ్రామాల సరిహద్దులను ఖరారు చేసే విషయంలో సర్వేయర్లు తీవ్రజాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రీసర్వే, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే పిజిఆర్‌ఎస్‌, ఫ్రీ హోల్డ్‌ భూములకు సంబంధించి సమీక్షించారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎస్‌.శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒలు డి.కీర్తి, రామ్మోహన్‌, సత్యవాణి, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి మురళి, సర్వేశాఖ ఎడి రమణమూర్తి, తహశీల్దార్లు, సర్వేయర్లు, డిటిలు పాల్గొన్నారు.

➡️