పార్వతీపురం: జిల్లాలో సంస్థాగతంగా ప్రజలకు సేవలు అందించడంలో లోపాలు పట్ల వివిధ పత్రికల్లో వస్తున్న ప్రతికూల వార్తలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలందించాలని కోరారు. సూర్యఘర్ యోజన మంచి కార్యక్రమమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి అందరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, వాటిపై ఎప్పటికప్పుడు అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్లె పండగ పనులన్నీ ఈ మాసాంతంలోగా శతశాతం పూర్తి చేయాలని, పూర్తిచేసిన వాటికి చెల్లింపులు జరగాలని పేర్కొన్నారు. సమావేశంలో జెసి ఎస్.ఎస్.శోబిక, డిఆర్‌ఒ కె.హేమలత, కెఆర్‌ఆర్సీ ఎస్డీసి పి.ధర్మచంద్రారెడ్ది, పలువురు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
