జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

May 25,2024 20:46

కొమరాడ: జ్వరాలు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన జ్వరాలున్నాయన్న సమాచారం మేరకు అంటివలస గ్రామాన్ని శనివారం సందర్శించారు. అక్కడ నిర్వహించిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది చేపట్టిన ఫీవర్‌ సర్వేలో నిర్దారణ పరీక్షలను పరిశీలించగా ఇద్దరికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. అంతకు ముందు గుర్తించిన జ్వరపీడితుని ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ఎమ్‌పిడిఒ మల్లికార్జునరావుతో కలిసి గ్రామంలో సందర్శించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. దోమల సంభావ్యత గల ప్రాంతాలు ఉన్నాయేమోనని తనిఖీ చేసి నీటి నిల్వలు పరిశీలించారు. దోమలు నివారణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గృహ సందర్శన చేసి జ్వారాలపై ఆరా తీసి వారి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. గ్రామంలో జ్వర నిర్దారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉంచుతూ పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య సేవలందించే విషయమై తక్షణమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ శామ్యూల్‌, ఏఎమ్‌ఓ సూర్యనారాయణ, ఇఒపిఆర్‌డి రాధాకృష్ణ, సిహెచ్‌ఒ బంగారు బాబు, వైద్య సిబ్బంది సురేష్‌, సరస్వతి, మాధురి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️