బోనస్‌ వెంటనే చెల్లించాలి

Jan 11,2025 21:15

ప్రజాశక్తి – పాచిపెంట: విశాఖ డైరీ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన బోనస్‌ సొమ్ము వెంటనే చెల్లించాలని, తగ్గించిన పాల ధర పెంచాలని పాల రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పాచిపెంటలోని శనివారం పాల రైతుల సంఘం నాయకులు తూముల అప్పన్న, గంగవంశం సత్యనారాయణ, దేవకోట ఎర్రయ్య ఆధ్వర్యంలో పాడి రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కె.ఈశ్వరరావు మాట్లాడుతూ వెంటనే బోనస్‌ చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని, పాల ధరలు పెంచాలని డిమాండ్‌ చేశారు. డైరీ పాలకవర్గం, అధికారులు లక్షల్లో వేతనాలు తీసుకొని, పాల ధరను అమాంతంగా తగ్గించి రైతులను మోసగించడం సరైంది కాదన్నారు. బోనస్‌ కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. డైరీ లాభాల నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు బోనస్‌ చెల్లించాల్సి ఉండగా సక్రమంగా అమలు చేయడం లేదని, దీనికి యాజమాన్యం పూర్తి బాధ్యత పడి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందులతో పాటు దానా రేట్లు పెరిగాయని, దానా 75శాతం రాయితీతో ఇవ్వాలని కోరారు. విశాఖ డైరీ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాస్థాయి మేనేజర్లు, అధికారులు స్పందించి రైతుకు రావాల్సిన బోనస్‌ చెల్లించి విశాఖ డైరీని సక్రమ మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని, తక్షణమే బోనస్‌ చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విశాఖ డైరీ పాచిపెంట మండలం డైరీ ఫారం అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం అందించి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్తాపు సురేష్‌, ఎడ్ల గణేష్‌, మహంతి తౌడు తదితరులు పాల్గొన్నారు.

➡️