అంధుల ఆరాధ్యుడు బ్రెయిలీ

Jan 7,2025 20:54

ప్రజాశక్తి – పార్వతీపురం : లూయిస్‌ బ్రెయిలీ అంధుల పాలిట ఆరాధ్య దైవమని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎండి గయాజుద్దీన్‌ అన్నారు. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్బంగా మంగళవారం ఆర్‌సిఎం (పాఠశాల) ప్రాంగణంలో బ్రెయిలీ చిత్ర పటానికి పూలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా గయాజుద్దీన్‌ మాట్లాడుతూ బ్రెయిలీ భాషను కనిపెట్టిన లూయిస్‌ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అంధులకు ఉండే హక్కులు, వారు ఎదుర్కొనే సమస్యలపై అవగాహనా కలిగిండాలన్నారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి కె.కవిత మాట్లాడుతూ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతిఏటా జనవరి 4న జరుపుకుంటామన్నారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో జీవిస్తున్న వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైందన్నారు. లూయిస్‌ బ్రెయిలీ అనే మహనీయుని పుట్టినరోజు సందర్భంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఆయనే బ్రెయిలీ లిపిని ఆవిష్కరించారని, బ్రెయిలీ లిపి అనేది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయోగించే భాష. పుట్టుకతోనో, లేదా ఇతరత్రా కారణాలతో కంటి చూపు కోల్పోయిన వారు చదువుకు దూరమవ్వకుండా ఉండేందుకే బ్రెయిలీ లిపిని రూపొందించారని ఆమె అన్నారు. అంధత్వంతో బాధపడుతున్న వారు తమ స్వశక్తితో సమాజంలో ఇతరులతో సమానంగా నిలిచేందుకు బ్రెయిలీ లిపి దోహదపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో సతమతమవుతున్నవారికి లూయిస్‌ బ్రెయిలీ తన ఆవిష్కరణతో మార్గదర్శిగా నిలిచారని అన్నారు. లూయీస్‌ బ్రెయిలీ జీవించి ఉన్నప్పుడు దక్కని గౌరవం అతని మరణాంతరం దక్కిందన్నారు. ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరపుకోవడమే ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవమని ఆమె అన్నారు. కార్యక్రమంలో విసిఇఎ అస్సోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సూర్యనారాయణ, అంధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️