తూతూ మంత్రంగా బిటి రోడ్డు పనులు

Apr 13,2025 21:38

ప్రజాశక్తి – కురుపాం : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గిరి శిఖర గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన గ్రామాల ప్రజలకు డోలి మోతలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక నిధులను విడుదల చేసి రోడ్లు మంజూరు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలోకి వచ్చేసరికి రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత డొల్లతనం తేటతెల్లమవుతుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు పనులు చేస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం కావడం లేదు. రోడ్డు పనుల నాసిరకానికి నిదర్శనం మండలంలోని జి.శివడ పంచాయితీలో గల అంటిజోల రోడ్డే. ఈ గ్రామం నుంచి మణిగి గ్రామానికి 2.3 కిలోమీటర్ల బిటి రోడ్డును మార్చి నెలాఖరుకు పూర్తి చేశారు. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ రోడ్డు వేసిన రెండు వారాలకే ఎక్కడికక్కడ ముక్క ముక్కలుగా పెచ్చులూడిపోయి అధ్వానంగా తయారైంది. ఈ సందర్భంగా స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు ‘ప్రజాశక్తి’తో మాట్లాడుతూ వేసిన బిటి రోడ్డు ఉల్లిపొర దళసరితో వేస్తున్నారని, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటే ఎక్కడికి అక్కడ పెచ్చుపెచ్చులూడిపోవడంతో రోడ్డు వేసిన రెండు వారాలకే ఇలా మారితే కనీసం 6 నెలలు అయితే పూర్తిగా బిటి రోడ్డు కనిపించే దాఖాలు ఉండవని విమర్శిస్తున్నారు. ఇంత దారుణంగా, నిర్లక్ష్యంగా నాణ్యత లేకుండా బిటి రోడ్లును కాంట్రాక్టులు వేస్తుంటే అధికారులు కనీసం పని వద్దకు వచ్చి నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంలో దారుణమన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రోడ్డు ఇలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులంటే అధికారులకు అంత చులకనగా ఉందని, ప్రభుత్వం గిరిజన ప్రజలకు ప్రాధాన్యతిస్తున్న నిధులు కేటాయిస్తూ రహదారి సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేయకుండా అధికారులు మాత్రం తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతతో కూడిన బీటీ రోడ్డును వేయించేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు నాణ్యత విషయమై పంచాయతీరాజ్‌ జెఇ పి.నాగేశ్వరరావును ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా, రోడ్డు పెచ్చులూడిన విషయం తనకు తెలియదని సమాచారం ఇచ్చారు.
అధికారుల నిర్లక్ష్యంతో నాణ్యతలేని బిటి రోడ్డు
బిటి రోడ్డు నిర్మాణపనులు జరుగుతున్న సమయంలో కనీసం అధికారులు వచ్చి పర్యవేక్షించిన దాఖాలా లేకపోవడంతో కాంట్రాక్టర్లు వారికి నచ్చినట్టుగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇస్తానుసారంగా వేయడం వల్ల వేసిన రెండు వారాలకే ఎక్కడకి అక్కడ రోడ్డు పెచ్చులూడిపోవడం జరిగింది. పంచాయతీరాజ్‌ అధికారులకు అడగగా తమకు తెలియదని సమాధానం చెప్పుతున్నారు. బి. మిన్నారావు, సర్పంచ్‌ జి.శివడ గ్రామపంచాయతీ.

➡️