ప్రజాశక్తి – కొమరాడ : పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని కొమరాడలో నిర్మిస్తున్న రెండు బీటీ రోడ్ల నిర్మాణ పనులను ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. అందులో భాగంగా దిగువ గుణద నుంచి సవర గుణద వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డుతో పాటు దిగువ గుణద నుంచి బిన్నిడి వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డును సందర్శించి, నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పిఒ మాట్లాడుతూ రహదారులు నాణ్యతగా ఉండాలని, నాణ్యత లేని రహదారులకు బిల్లులు చెల్లింపులు ఉండబోవని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ మణి రాజు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం : పల్లె పండుగ కార్యక్రమం కింద చేస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించకూడదని ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పాలకొండ, వీరఘట్టం మండలాల్లో పర్యటించి పల్లె పండుగ కార్యక్రమం కింద చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పాలకొండలోని టికెఆర్ పురం, చింతాడ, ఆర్తలి గ్రామాల్లో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సంధర్బంగా సీసీ రోడ్డు, కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఇంజనీరింగ్ పనుల్లో నాణ్యత లోపించకూడదని అన్నారు. అదే విధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని పనులు పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వీరఘట్టం మండలంలోని ఎం.రాజపురంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడ కూడా పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఇలు సింహాచలం, రాధారాణి, లోకనాధం ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
