సాలూరు రూరల్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసేలా ఉందని, రాష్ట్రానికి సరిపడే నిధులు ఇవ్వాలని సిఐటియు సాలూరు కమిటీ డిమాండ్ చేసింది. బడ్జెట్‌కు వ్యతిరేకంగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ నాయకులు టి.రాముడు, టి.శంకర్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఇక్కడ ఉన్న కూటమి నాయకులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అన్యాయం జరిగినా రాష్ట్రానికి మోడీ చాలా చేశారని ఇంకా చేస్తారని ఇక్కడ చెబుతుండడం రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసినట్లేనని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఇక్కడున్న పాలకులు మేల్కొని రాష్ట్రానికి రావలసిన నిధులు రప్పించుటలో ముందుండాలని లేకపోతే ఆంధ్రరాష్ట్రం మరింత వెనుకబడి పోతుందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్యాసంస్థలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు ఇవ్వాలి కానీ అటువంటి నిర్ణయాన్ని ఏ బడ్జెట్లో కూడా తీసుకోకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని ఇక్కడ ఉన్న నాయకుల చేతగాని తనమే అవుతుందని విమర్శించారు. ఇప్పటికే జిల్లాలోని పరిశ్రమలను మూసేసి పనులు లేకుండా కార్మికులు వారి కుటుంబాలు వలసలు పోతున్నారని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీటిని ఆపేలా లేదా ధరలు తగ్గేలా ఎలాంటి నిర్ణయాలు చేయలేదని ఇది ప్రజలను మోసగించడమేనని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించేలా, రాష్ట్రానికి మేలు కలిగేలా నిధులు వచ్చేలా కృషి చేయాలని లేకపోతే భవిష్యత్తులో ప్రజానీకాన్ని కలుపుకొని పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీను, రవి, మధు, పోలరాజు తదితరులు పాల్గొన్నారు.
