జీడి పిక్కలకు కేజీ రూ.200 మద్దతు ధర ప్రకటించాలి

Mar 10,2025 21:42

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : జీడిపిక్కలకు మద్దతు ధర కేజీ రూ.200 ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ పి.కిరీటికి వినతిని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగా జీడి పిక్కల పంట మారిందని, మండలంలో సుమారు 200 ఎకరాల్లో గిరిజనులు జీడి సాగు చేస్తున్నారని అన్నారు. అయితే సరైన ధర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వారు దళారీల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐటిడిఎ అధికారులు జీడిపక్కా… బతుకు పక్కా అన్న నినాదంతో అందించిన జీడి మొక్కలను పెంచుకొని తమ ప్రధాన ఆర్థిక వనరుగా మార్చుకున్నామని, అయితే ఇప్పుడు దానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. కావున వెంటనే ప్రభుత్వం మద్దతు ధర జీడిపెక్కకు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజనసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కడ్రక రామస్వామి, సభ్యులు పి రాము తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : జీడి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి, జిసిసి ద్వారా కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండంగి రమణ కోరారు. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీడి పంటనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారన్నారు. వేలాది ఎకరాల్లో జీడి పంట దిగుబడి వస్తున్నా ప్రభుత్వం కొనుగోలు లేక దళారులతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో జీడి కొనుగోలు కేంద్రాలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు చేయాలని, గిడిజనులకు ఉపాధి కల్పించాలని కోరారు. గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదని, కావున స్థానికంగా మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన సేవలు అందించాలని కోరారు. అలాగే గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, కావున గుమ్మలక్ష్మీపురంలో బిఇడి, డైట్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మండంగి శ్రీనివాసరావు, బిడ్డిక శంకరరావు, బిడ్డిక అడిత్తు, పువ్వల తిరుపతరావు ఉన్నారు.సాలూరు రూరల్‌ :.జీడీ పంటకు కనీస మద్దతు ధర రూ.200 ప్రకటించి, జీడీ ప్రొసీసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తహశీల్దార్‌కు వినతి పత్రాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సీదరపు అప్పారావు, మండల అధ్యక్ష కార్యదర్శులు వంతల సుందర్రావు, గెమ్మెల జానకిరావు మాట్లాడుతూ మండలంలో సుమారు 4వేల మంది రైతులు 5500 ఎకరాల్లో జీడి పంటను పండిస్తున్నారని, ఎకరాకు 250 కేజీలు చొప్పున పంట దిగుబడి వస్తుందన్నారు. జీడీకి కనీసం మద్దతు ధర కేజీకి రూ.200 ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే మండలంలోని కురుకుటి, వెలగవలస గ్రామాల్లో జీడి ప్రాసెసింగ్‌ పరిశ్రమ యూనిట్లు ప్రారంభించి గిరిజన యువత ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు చింత జోగయ్య, పొట్టంగి రాము, మెల్లిక అయోధ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి తాడంగి గాసి తదితరులు పాల్గొన్నారు.17,18 తేదీల్లో ఐటిడిఎ వద్ద ధర్నా కొమరాడ : జీడి ప్రాసెసింగ్‌ సెంటర్లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు హెచ్‌.రామారావు డిమాండ్‌ చేశారు. ఈనెల 17, 18 తేదీల్లో ఐటిడిఎ వద్ద 48 గంటల ధర్నా చేపడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐటిడిఎ పరిధిలో 8 మండలాల్లో గిరిజనులు 60వేల ఎకరాల్లో జీడి సాగు చేస్తున్నారన్నారు. గిట్టుబాటు ధర కల్పించేలా గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో జీడి పిక్కల ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి గిరిజన పండించిన జీడి పంటతో పాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. సాగునీటి సమస్య పరిష్కరించాలని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, నిరుపేదలకు ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం నాయకులు రామస్వామి, పోల్రాజు, వెంకటేష్‌, గిరిజన మహిళలు పాల్గొన్నారు.

➡️