ధర్మాసుపత్రిలో అంతర్యుద్ధం

Jan 16,2025 20:31

ప్రజాశక్తి – సాలూరు : స్థానిక ఏరియా ఆసుపత్రిలో గత కొంతకాలంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. వైద్యుల మధ్య గ్రూపు తగాదాలు చాపకింద నీరులా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నకుమారి, మరికొంత మంది వైద్యుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. జూనియర్‌ డాక్టర్‌కు సూపరింటెండెంట్‌ బాధ్యతలు అప్పగించడంపై కొంతమంది సీనియర్‌ డాక్టర్లు అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి నెలకొంది. దీని ఫలితంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది మధ్య ముఠాలు ఏర్పడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నకుమారిపై ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్‌ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు లో పేర్కొన్నట్లు సమాచారం.సీనియర్‌ డాక్టర్‌ ఉద్యోగోన్నతికి జిల్లా మంత్రి బ్రేక్‌! ఆసుపత్రిలో సీనియర్‌ డాక్టర్‌ గా పని చేస్తున్న మీనాక్షికి దక్కిన సూపరింటెండెంట్‌ కుర్చీని దక్కకుండా జిల్లా మంత్రి అడ్డుపుల్ల వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె కంటే జూనియర్‌ అయిన డాక్టర్‌ రత్నకుమారిని సూపరింటెండెంట్‌ చేయడంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది జీర్ణించుకోలేక పోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే డాక్టర్‌ మీనాక్షిను గత ప్రభుత్వం హయాంలోనే సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పుడు కూడా ఆమె నియామకానికి కొంతమంది వైసిపి నాయకులు అడ్డుపుల్ల వేయడంతో ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కొద్దిరోజుల క్రితం ఆమెను మళ్లీ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తనకు తెలియకుండా, తనను సంప్రదించకుండా సూపరింటెండెంట్‌ గా నియామక ఉత్తర్వులు జారీ చేయడాన్ని మంత్రి సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జారీ అయిన ఉత్తర్వులు అమలు కాకుండా మంత్రి ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడంతో డాక్టర్‌ మీనాక్షికి మరోసారి నిరాశ ఎదురైందన్న చర్చ జరుగుతోంది.

➡️