జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి

Jan 8,2025 21:34

ప్రజాశక్తి-పార్వతీపురం : జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేవిధంగా అధికారులు సమన్వయంతో సమిష్టి కృషి చేయాలని అరకు ఎమ్‌పి తనూజారాణి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మంచి వైద్యం, నాణ్యమైన విద్య అందేవిధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గర్భిణులు, చిన్నారుల్లో ఎనీమియా లోపాన్ని అధిగమించేందుకు గ్రామాల్లో ఎఎన్‌ఎం, ఆశా వర్కర్లను పంపించి రక్తహీనతతో బాధపడుతున్న వారిని దత్తత తీసుకొని పర్యవేక్షిస్తున్నామని, ప్రతి 15 రోజులకు పౌష్టికాహారం అందిస్తున్నామని డిఎంహెచ్‌ఒ భాస్కరరావు వివరించారు. మెరుగైన చర్యలు చేపట్టడం వల్ల రక్తహీనత బాధితుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, భవిష్యత్తులో సికిల్‌సెల్‌ కేసులు వచ్చే అవకాశం ఉండదని ఎమ్‌పి తెలిపారు. కుసుం పథకంలో భాగంగా సౌర విద్యుత్‌, వ్యవసాయం ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఎమ్‌పి ల్యాండ్‌ నిధులతో రోడ్లు డ్రెయిన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాల పనుల వివరాలపై ఆరా తీశారు. అవసరమైన చోట అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణాలకు, పాఠశాలలో మరుగుదొడ్లు మరమ్మతులు, ఆధునీకరణ పనులకు నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలని ఇంజినీరింగ్‌ అధికారులను కోరారు. జిల్లాలో ప్రధానమంత్రి అర్బన్‌ ఆవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివిధ శాఖల వారిగా పురోగతిని, అభివృద్ధి పనుల ప్రగతిని ఎమ్‌పికి తెలియజేయడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా రహదారుల అభివృద్ధిలో భాగంగా మూడు రాష్ట్ర హైవేలను జాతీయ రహదారులుగా మార్పు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌. శోభిత, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, జెడ్‌పి సిఇఒ బి.వి.సత్యనారాయణ, డిఆర్‌ఒ కె.హేమలత, డ్వామా పీడీ కె.రామచంద్ర రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్‌పాల్‌, గృహ నిర్మాణ సంస్థ పీడీ ఆర్‌.వంశీకృష్ణ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకరరావు, డిఆర్‌డిఎ పీడీ వై.సత్యం నాయుడు, జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఎం.వి.నాగేష్‌ బాబు, డిఇఒ ఎన్‌.తిరుపతి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️