తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్‌

Oct 28,2024 21:27

సీతంపేట: తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ ఏ శ్యామ్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. త్రాగు నీటి అవసరాలను ప్రతి ఆవాసంలో గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. తాగు నీటికి మండల స్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని, ఏ గ్రామంలోనూ త్రాగు నీరు లేదు అనే ప్రశ్న తలెత్తరాదని ఆయన చెప్పారు. వేసవిలో కూడా ఎక్కడా తాగు నీరు కొరత లేకుండా శాశ్వత పరిష్కారం ఉండాలని, స్పష్టమైన సర్వే చేయాలని స్పష్టం చేశారు. జల్‌ జీవన మిషన్‌ పనుల ప్రగతి వివరాలు అందించాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ సోమవారం సమీక్షించారు. రహదారుల పనులను క్వాలిటీ తనిఖీలు పూర్తయిన తర్వాతే బిల్లుల చెల్లింపు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రగతిలో ఉన్న పనులు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎంపిసిసి పనులు 14 మంజూరు కాగా, ఇప్పటి రెండు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. భామిని ఏకలవ్య మోడల్‌ పాఠశాల భవనాలు త్వరగా పూర్తి చేయాలని, దీనిపై ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ దష్టిలో పెట్టాలని ఆదేశించారు. పనులు వేగవంతం కావడానికి గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తాగునీరు, రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. అంగన్వాడీ భవనాల్లో మరుగుదొడ్లు, తాగు నీరుకు ఇచ్చిన డిజైన్‌ను పక్కాగా అనుసరించాలని ఆయన అన్నారు. సమావేశంలో ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ పి రమాదేవి, డిఇఇ సింహాచలం, జిల్లా ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకరరావు, డ్వామా పీడీ కె.రామ చంద్రరావు, ఇతర శాఖల ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️