అన్నింటా మున్సిపాల్టీలు ముందంజలో ఉండాలి : కలెక్టర్‌

Nov 5,2024 21:03

ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎస్‌టిపి (సీవేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌), డంపింగ్‌ యార్డు, తడి-పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీరు వంటి ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపాలిటీల అభివృద్ధిపై సంబంధిత కమిషనర్లతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మున్సిపాల్టీలో పచ్చదనం, పారిశుద్ధ్యం, మొక్కలను నాటడం, రహదారులు, పార్కులను అభివృద్ధి చేయడం వంటివి చేపట్టాలన్నారు. అన్ని అంశాల్లో మన మున్సిపాల్టీలు ముందంజలో ఉండాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి మున్సిపాల్టీకి అదనపు ఆదాయం సమకూరేలా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని తెలిపారు. మరుగుదొడ్లు లేని ప్రాంతాల్లో సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని, వాటి నిర్వహణ ఖర్చులు వారే సమకూర్చుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే, బస్‌ స్టేషన్లు, ముఖ్య కూడళ్లను గుర్తించి, అటువంటి చోట్ల ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా అన్ని మున్సిపాల్టీల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, జన సందోహం ఉన్నచోట్ల సిగల్‌ లైట్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో గుంతలు లేని రహదారులకు ప్రాధాన్యతను ఇవ్వాలని, ఎక్కడా గుంతలు లేకుండా రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తరాదని, అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి మున్సిపాల్టీల్లో పారిశుధ్ధ్యం లోపించరాదని డంపింగ్‌ యార్డు, బర్రెల గ్రౌండ్‌ సమస్య లేకుండా ప్రణాళికలు చేయాలని, తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త నుంచి సంపదను సృష్టించే మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. సీవేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లను అన్ని మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపాల్టీ పరిధిలో నిర్మితమవుతున్న గృహాలను పరిశీలించి అవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పిఎం సూర్య ఘర్‌తో లబ్దిదారులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని ఆయా మున్సిపాల్టీ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. దీని ద్వారా లబ్దిదారునికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్‌ అశుతోశ్‌ శ్రీవాస్తవ, పార్వతీపురం, సాలూరు. పాలకొండ మునిసిపాలిటీల కమిషనర్లు, ఇంజినీరింగ్‌, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️