విస్తృత తనిఖీలు నిర్వహించాలి : కలెక్టర్‌

Sep 30,2024 21:13

పార్వతీపురం: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీసు, ఫారెస్ట్‌, ఎక్సైజ్‌ శాఖలతో జాయింటు ఆపరేషను నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్‌ లలో డాగ్‌ స్వ్కాడ్‌ తో తనిఖీలు నిర్వహించాలన్నారు. చెక్‌ పోస్టులు వద్ద సిసి కెమెరాలు, కంట్రోలు రూం ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యా సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గరలో గల షాపుల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా నిఘా నిర్వహించాలని తెలిపారు. నూతన మద్యం పాలసీ అమలుకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎస్‌పి మాధవరెడ్డి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు రవాణా జరగకుండా అన్ని శాఖలు చర్యలు చేపట్టాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో సాగు చేయకుండా ఆ శాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా శాఖ అధికారులు లారీయజమానులతో సమావేశం నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా మార్పులు చేసిన వాహనాలను గమనించినట్లయితే సమాచారం అందించాలని తెలిపారు. ఎఎస్‌పి ఒ.దిలీప్‌ కిరణ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కేసుల్లో 276 కేజీల గంజాయి పట్టుకొని 44 మందిపై కేసులు పెట్టినట్లు తెలిపారు. చట్టరీత్యా విద్యా సంస్థలకు 300 మీటర్ల దూరంలో సిగరెట్‌, మద్యం, మత్తు పదార్థాల విక్రయం, సరఫరా జరగరాదని తెలిపారు. సమావేశంలో డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన, పాలకొండ డిఎస్పీ రాంబాబు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం వినోద్‌, జిల్లా బిసి, సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారు ఎస్‌.కృష్ణ, ఎం.డి.గయాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️