ప్రజాశక్తి – పార్వతీపురం: జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో ముందస్తు ఏర్పాట్లపై జిల్లాస్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పిఒలు అశుతోశ్‌శ్రీవాస్తవ, యశ్వంత్ కుమార్‌రెడ్డితో కలిసి ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో అధికారులంతా సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా పూర్తిచేయాలని తెలిపారు. ధాన్యం సేకరణలో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తరాదని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన గన్నీ సంచులు, రవాణా ఏర్పాట్లు, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన పరికరాలు అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు నగదు చెల్లించేందుకు వీలుగా ఖచ్చితత్వంతో కూడిన బ్యాంకు ఖాతాలను రైతుల నుంచి ముందుగా పొందాలని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఊరుకోబోమని, మిల్లర్లకు సహకరిస్తామని, అలాగే మిల్లర్లు కూడా రైతులకు సహకరించాలని రైస్ మిల్లర్ల యజమానులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్ పాల్, పౌర సరఫరాల మేనేజర్, ఇన్‌ఛార్జ్ జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాసులు, ఆర్‌టిఒ ఎం.శశికుమార్, డిసిఒ పి.శ్రీరామ్మూర్తి, జిసిసి డివిజనల్ మేనేజర్ వి.మహేంద్రకుమార్, సీతంపేట బ్రాంచి జిసిసి మేనేజర్ కృష్ణ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మిల్లర్ల యజమానులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
