12న యువత పోరుకు రండి : రాజన్నదొర

Mar 10,2025 21:32

ప్రజాశక్తి – సాలూరు : రాష్ట్రంలో పది నెలల టిడిపి పాలనలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్‌ లేదని, నిరుద్యోగ యువతకు భృతి కరువైందని మాజీ డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి నియోజకవర్గ నాయకులతో కలిసి ఈనెల 12న జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న యువత పోరుకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వెన్నుపోట్ల రుచి చూపించినట్లు చెప్పారు. నమ్మించి మోసం చేయడమెలాగో టిడిపి నాయకులు కళ్లకు కట్టినట్లు చూపించారని ఆరోపించారు. పదినెలల కాలంలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్‌ కింద నిధులు మంజూరు చేయకపోవడంతో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని చెప్పారు. సకాలంలో ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకానికి రూ.2600 కోట్లు కేటాయించారని, వాస్తవానికి రూ.3900 కోట్లు అవసరమని చెప్పారు. ఎన్నికల ముందు యువగళం పేరుతో మంత్రి నారా లోకేష్‌ ఊరూరా తిరిగి విద్యార్థులు, యువతకు లేనిపోని హామీలిచ్చి ఆశలు రేకెత్తించారని చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ.3వేలు చొప్పున భృతి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. లోకేష్‌ ఉత్తర ప్రగల్భాలకు ఆకర్షితులైన విద్యార్ధులు, యువకులు ఇప్పుడిప్పుడే వాస్తవాలు గమనిస్తున్నారని చెప్పారు. విద్యార్ధి, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 12న జిల్లా కలెక్టరేట్‌ వద్ద యువత పోరు ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో గల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు హాజరు కావాలని రాజన్నదొర కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్‌ వంగపండు అప్పల నాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, వైసిపి నాయకులు పి.అప్పలస్వామి, పి.రామకృష్ణ, ఎం.అప్పారావు, కొల్లి వెంకటరమణ, కస్తూరి రామకృష్ణ పాల్గొన్నారు.20మంది యువకులు వైసిపి లో చేరిక పట్టణంలోని వెలంపేటకు చెందిన 20మంది టిడిపి కార్యకర్తలు రాజన్నదొర సమక్షంలో వైసిపిలో చేరారు. రాజన్నదొర నివాసంలో జరిగిన కార్యక్రమంలో కిలపర్తి ఓంకేష్‌, వి.ప్రేమ్‌, పూసర్ల దిలీప్‌ ఆధ్వర్యాన 20మంది యువకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిం చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, పట్టణ అధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, వైసిపి నాయకులు కొల్లి వెంకటరమణ, ఎం.అప్పారావు, పిరిడి రామకష్ణ, అప్పలస్వామి పాల్గొన్నారు.పాలకొండ : ఈనెల 12న జిల్లా కేంద్రంలో తలపెట్టిన యువత పోరు పోస్టర్లను ఎమ్మెల్సీ విక్రాంత్‌ స్వగృహంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలవలస విక్రాంత్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పోస్టల్‌ ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, వైస్‌ చైర్మన్‌ రౌతు హనుమంతరావు, వెలమల మన్మధరావు, నీలాపు శ్రీనివాసరావు, నంబూరు సర్పంచ్‌ ఉపేంద్ర, దుంపల చిన్ని తదితరులు ఉన్నారు.

➡️