ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : ఓపెన్ స్టేట్ మీట్ టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన ఎఆర్ కానిస్టేబుల్ కెఆర్ అరుణ్ కుమార్‌ను బుధవారం జిల్లా ఎస్పీ ఎస్‌వి మాధవ్ రెడ్డి తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఎఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కె.అరుణ్ కుమార్ కాకినాడ ఇండోర్ స్టేడియంలో ఇటీవల జరిగిన ఎపి యూత్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ స్టేట్ మీట్ తైక్వాండో పోటీల్లో సీనియర్ పురుషుల విభాగంలో (80 కేజీల విభాగంలో) పాల్గొని విజయం సాధించి బంగారు పతకాన్ని కైవససం చేసుకున్నారు. అలాగే ముగ్గురు సభ్యులు జట్టుగా ఆడే తైక్వాండో పోటీల్లో అరుణ్ కుమార్ జట్టు విజయం సాధించి బంగారు పతకాన్ని కైవససం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మున్ముందు జరగబోయే క్రీడల్లో పాల్గొని విజయం సాధించి రాష్ట్ర, జిల్లాపోలీస్ ఖ్యాతిని పెంచాలని హితువుపలికారు. కార్యక్రమంలో ఎఆర్ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు అరుణ్ కుమార్ అభినందించారు.
