పార్వతీపురం: గిరిజనుల హక్కుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను గిరిజనులంతా ఐక్యంగా ప్రతిఘటించాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ఈనెల 11,12 తేదీల్లో జరిగే మన్యం బందును జయప్రదం చేయాలని కోరారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా సమావేశం నిర్వహించారు. అనంతరం బంద్ రోజున బస్సులు నిలిపివేసి సహకరించాలని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌కు నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోలక అవినాష్ కుమార్, జిల్లా అధ్యక్షులు ఎం.లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్నారని, వారికి రాజ్యాంగబద్ధంగా హక్కలు, చట్టాలు కల్పించబడ్డాయని తెలిపారు. కొన్ని రోజుల క్రితం గిరిజన ప్రాంత అభివృద్ధికి 1/70 చట్టమే ఆటంకమని, వాటిని సవరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంపై కార్పొరేట్ వ్యక్తులు డేగ కళ్లతో కాలు దువ్వాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో అయ్యన్నపాత్రుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అమానుషమని మండిపడ్డారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటన విడుదల చేయాలని, రాష్ట్ర తెలుగుదేశం, జనసేన, బిజెపి స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టానికి రక్షణ కల్పించాలని, ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగ, ఉపాధ్యాయులు నియామక చట్టం చేయాలని, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా నాయకులు మండంగి రమణ, రామారావు, కె.సీతారాం తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : ఈనెల 11, 12వ తేదీల్లో తలపెట్టిన ఏజెన్సీ బంద్‌ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మధు ప్రసాదు, నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఈ మేరకు కూనేరు సంతలో ఏజెన్సీ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ఆదివాసీ సంఘాల బంద్ సంపూర్ణంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ఈనెల 12న కొమరాడలో పెద్ద ఎత్తున ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన ప్రజలు పాల్గొన్నారు.
