గిరిజన చట్టాల నిర్వీర్యానికి కుట్ర

Apr 16,2025 21:29

ప్రజాశక్తి-పాచిపెంట : గిరిజనులకు, వారి భూములకు రక్షణగా నిలస్తున్న చట్టాలను కేంద్రంలోని మోడీ కుట్ర నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని సరాయివలస జంక్షన్‌లో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మజ్జి కృష్ణమూర్తి అధ్యక్షతన గిరిజన చట్టాలు- కాలరాస్తున్న పాలకులు అనే అంశంపై సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో ఆయన మాట్లా డుతూ గిరిజన ప్రాంతాల్లో నేటికీ డోలిమోతలు తప్పడం లేదని, పూర్తిస్థాయిలో రహదాల నిర్మాణం చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి సమస్య నిత్యకృత్యమైందని, మౌలిక సదుపాయాలు, ఇల్లు నిర్మాణాలు, తదితర ఇబ్బందులు వెంటా డుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యల పరి ష్కారం పాలకులకు పట్టడం లేదని విమర్శించారు. మరోవైపు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంటే, అందుకు రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడ్డారు. అందుకే నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చడం లేదని, పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయలేదని వివరించారు. దీని కారణంగా సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాలతో పాటు మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమ వుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మొన్న జరిగిన రీసర్వేలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ప్రభుత్వ, డి-పట్టా భూములను కూడా కాజేస్తున్నారని, దీనిపై సమగ్ర సర్వేలు చేపట్టి, గిరిజనులకు భూములు పంపిణీ చేయాలని డిమాండ్‌చేశారు. కుడుమూరులో తాతల కాలం నుంచి సర్వే నంబర్‌ 48లోని 782 ఎకరాలను సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గిరిజనులు హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ జిసిసి ద్వారా గిరిజనుల పండించిన అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోవడం వల్ల దళారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. జిసిసిని సమర్థ వంతంగా నడిపించే బాధ్యతను ప్రభుత్వం తీసు కోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుర్రు రామారావు, గిరిజన సంఘం నాయకులు పెదరామయ్య, చింత రాంబాబు, కొట్టిస శంకర్రావు, కె.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️