ప్రజాశక్తి – కొమరాడ : గర్భిణీల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు కెఆర్‌బి పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పిఎంఎస్‌ఎంఎ (ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్) కార్యక్రమాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అప్పుడే వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని ఫీడర్ అంబులెన్స్ వాహనంలో ఇంటికి బయల్దేరుతున్న గర్భిణీతో మాట్లాడి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. మారుమూల మసిమండ గ్రామానికి చేర్చుతున్నామని వాహన సిబ్బంది తెలిపారు. అనంతరం పిహెచ్‌సిలో గర్భిణీలకు వైద్యాధికారి, సిబ్బంది చేపడుతున్న ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు మాతా, శిశు సంరక్షణ కార్డుల్లో పరిశీలించారు. గత నెల నివేదికలు, ఆరోగ్య స్థితి వివరాలతో సరి చూశారు. ల్యాబ్ వద్ద పరీక్షలు చేస్తున్న తీరును గమనించారు. రక్తహీనత గుర్తించిన గర్భిణిల్లో నెలనెలా హీమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని, ఎనీమియా ఏక్షన్ కమిటీలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రసవ సమయం నాటికి రక్తహీనత ఉండరాదని, అంగన్వాడీ, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి గర్భిణుల పోషకాహారం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు సక్రమంగా తీసుకుంటున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. గర్భిణిల్లో జ్వర లక్షణాలను గుర్తిస్తే హైరిస్క్‌గా పరిగణించి తక్షణమే పరీక్షలు జరపాలన్నారు. అనంతరం డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్య తనిఖీలు, పరీక్షలు కోసం ప్రతి నెలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పిఎంఎస్‌ఎంఎ కార్యక్రమాన్ని ముందస్తు ప్రణాళికతో చేపట్టాలన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల గర్భిణిల ఆరోగ్య విషయమై మరింత శ్రద్ధ కనబర్చాలని సూచించారు. పిహెచ్‌సిలో ప్రసవాలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పిఎంఎస్‌ఎఎంలో గర్భిణీలకు అక్కడ పోషకాహారం అందజేసిన సత్యసాయి ట్రస్టు సేవను కొనియాడారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ టి.గణేష్‌పట్నాయక్, ఆరోగ్య శాఖ డెమో యోగీశ్వరరెడ్డి, ఎస్‌యుఒ ధనుంజయరావు, సూపర్వైజర్లు శోభ, శారద, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.