ప్రజాశక్తి – కురుపాం : నియోజవర్గ కేంద్రమైన కురుపాం డిసెంబర్ 10, 11 తేదీల్లో సిపిఎం 10వ జిల్లా మహాసభలు జరుగుతాయని, ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. శుక్రవారం కురుపాంలో గల రావాడ జంక్షన్ వద్ద పదో మహాసభల పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో అనేక ప్రజా సమస్యలు పరిష్కారానికి ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడింది సిపిఎం పార్టీనని, వాటిని సమీక్షించుకొని రాబోయే కాలంలో జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో పోరాటాలకు సమాయత్తమవుతుందని అన్నారు. జంఝావతి ప్రాజెక్టు, మినీ రిజర్వాయర్లు, గిరిజన ప్రాంతంలో చేక్ డాంలు నిర్మించాలని, గిరిజన ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు జీడి, చింతపండు, ఫైనాపిల్ తదితర పంటలతో చిన్న పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని, పార్వతీపురంలో మెడికల్ కాలేజీ వెంటనే నిర్మించాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన పేద విద్యార్థులకు ఆయా తరగతులకు జిల్లాలో ఇంజనీరింగ్, పీజీ కోర్సులు వెంటనే ప్రారంభించాలని, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు, సాగు, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. పార్టీలు మారినా, నాయకులు వారేనని, కావున పాలకుల మీద ఆశలు పెట్టుకొని ప్రజలు పోరాడకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని అన్నారు. జిల్లాలో చెరకు రైతుల ఉద్యమించి రూ.90 కోట్లు బకాయి సాధించుకున్నారని, భూపోరాటాలతో దళితులు, పేదలు భూములు సాధించారని, పెండింగ్ లో ఉన్న శివ్వాం, దళితులు, గిరిజనులు భూ సమస్యలపై పోరాటాల కొనసాగుతున్నాయని, తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసి తుల సమస్యలపై పోరాడి నష్టపరిహారం సాధిం చామని, ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం జిల్లా కమిటీగా పోరాడి సాధించు కున్నట్లే ప్రజా ఉద్యమాల్లో పాల్గొని పోరాటాల ద్వారా జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కావున ఉద్యమాలకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలక అవినాష్, కె.గంగు నాయుడు, మండల కార్యదర్శులు మండంగి శ్రీనివాసరావు, కె.సీతారాం, నాయకులు వెంకట్రావు, అనీల్ కుమార్, ఇండియా, సింహాచలం పాల్గొన్నారు.