సైబర్‌ టెక్నాలజీ ద్వారా నేరాలు నియంత్రణ : ఎస్‌పి

Feb 3,2025 21:34

పార్వతీపురంరూరల్‌ : సైబర్‌ టెక్నాలజీ ద్వారా నేరాల నియంత్రణకు సైబర్‌ సెల్‌ ఐటి కోర్‌ టీం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్‌పి ఎస్‌ మాధవ్‌ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్‌ సెల్‌, ఐటి కోర్‌ టీం అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎస్‌పి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, వీటివల్ల ప్రజలు కష్టపడి సంపాదించుకున్న నగదు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకుంటున్నారని అన్నారు. కావున సైబరు మోసాలు జరగకుండా ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించాలన్నారు. సైబరు మోసానికి గురైతే 1930కు లేదా సైబరు క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదయ్యేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్‌ అయిన నగదు బాధితులకు అందేలా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అదే విధంగా కాలానుగుణంగా మనం కూడా టెక్నాలజీపై పరిణితి చెందాలని సూచించారు. అందుకు అనుగుణంగా పోలీస్‌ సిబ్బంది అందరికీ సైబర్‌ నేరాల సాంకేతికతపై ప్రతి శనివారం శిక్షణా తరగతులు నిర్వహించాలని సైబర్‌సెల్‌, ఐటి కోర్‌ టీం అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో సోషల్‌ మీడియా, సైబర్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఎస్సై రవీంద్రరాజు, సైబర్‌ సెల్‌, ఐటి కోర్‌ టీం సిబ్బంది పాల్గొన్నారు.

➡️