ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : దళితులు, గిరిజనుల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని ఎమ్మెల్యే విజరు చంద్ర అన్నారు. మండలంలోని పెదబొండపల్లి, ఎమ్మానగర్ గ్రామంలో దళిత భూముల ఆక్రమణ విషయంలో ఆయన తీవ్రంగా స్పందించారు. 1980లో గ్రామానికి చెందిన కొంతమంది దళితులకు ప్రభుత్వం ఎకరా చొప్పున భూమి ఇచ్చిందిన్నారు. ఆ భూమిలో వాళ్లు మామిడి, జీడి వంటి తదితర పంటలు సాగు చేశారని 2019 వరకు వారి సాగు బడిలోనే ఉన్నాయని వైసిపి పాలనలో అక్రమాలకు తెర తీశారని ఆరోపించారు. వైసిపి అండదండలతో చుక్క శ్రీదేవి అనే మహిళ దళితుల భూముల్లో రోడ్లు వేయడం, హద్దులు వేయడం చేశారని ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. వైసిపిలో ఎన్నో భూ అక్రమాలు జరిగాయని వాటికి చరమగీతం పాడతామన్నారు. అప్పటి ఎమ్మెల్యే జోగారావు దళితుడై ఉండి దళితులకు అన్యాయం చేశారన్నారు. తక్షణమే శ్రీదేవి పై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. దశాబ్దాలుగా భూమిని నమ్ముకున్న దళితులకు అన్యాయం చేసే వారిని చూస్తూ ఊరుకోమని తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విజరు చంద్ర హెచ్చరించారు.మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల గోడ పత్రిక విడుదలపార్వతీపురంలో మార్చి 23వ తేదీన నిర్వహించనున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల గోడపత్రికలను ఎమ్మెల్యే విజరు చంద్ర శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. యువత శారీరక దారుడ్యం, ఆరోగ్యం కోసం జిమ్ములో సాధన చేయడం మంచి అలవాటుని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పోటీలకు తన వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు, యువత పాల్గొన్నారు.
