మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణ మృదంగం కొనసాగుతోంది. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పరిధిలో మూడు నెలల్లో ఐదుగురు విద్యార్థులు అనారోగ్యంతో మరణించడం, అందులో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి సొంత జిల్లాలో విద్యార్థుల వరుస మరణాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. గిరిజన పాఠశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాశక్తి-పార్వతీపురం: పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గడిచిన మూడు నెలల్లో ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. గడచిన రెండు రోజుల్లోనే పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు పరిధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కొమరాడ మండల కేంద్రంలో ఉన్న కెజిబివిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి కడ్రక శారద డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ విశాఖ కెజిహెచ్‌లో మరణించింది. జిల్లా కేంద్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లినా శారద ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో పాఠశాల సిబ్బంది కెజిహెచ్‌కి తరలించారు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అవంతిక కూడా డెంగీతో మృతి చెందింది. అంతకుముందు జులై నెలలో ముగ్గురు విద్యార్థులు అనారోగ్యంతో మరణించారు. జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి బి.ఈశ్వరరావు జులై 6న మృతి చెందాడు. అదే నెలలో సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిని బి.రిష్మిత మరణించింది. జులై 22న పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి పి.రాఘవ అనారోగ్యంతో మృతి చెందాడు. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పని చేయాల్సిన ఐటిడిఎ ప్రాజెక్టులకు సరిపడా నిధులు మంజూరు కాకపోవడం, రెగ్యులర్ పిఒలు లేకపోవడంతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై తగిన పర్యవేక్షణ కొరవడుతోంది. దీని కారణంగా విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.తొలి సంతకం అమలేది?గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంల నియామకానికి సంబంధించిన ఫైలుపై గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి మొదటి సంతకం చేశారు. కానీ ఇంతవరకు గిరిజన పాఠశాలల్లో ఎఎన్‌ఎంల నియామకానికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ పాఠశాలల డైట్ బిల్లు లు కూడా సకాలంలో మంజూరు కావడం లేదు. విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు వారిని సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధిత పాఠశాల హెచ్‌ఎం లేదా వార్డెన్ తీసుకెళ్ళాలి. వారికి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే పరిజ్ఞానం ఉండకపోవచ్చు. పాఠశాలలో అందుబాటులో ఉన్న మందులను వినియోగించడం ద్వారా ప్రాథమిక చికిత్స అందించవచ్చు. ఈవిధమైన చర్యలు తీసుకోవడంలో పాఠశాల హెచ్‌ఎం లేదా వార్డెన్‌కు పని ఒత్తిడి వల్ల కొంత జాప్యం జరిగితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు విషమించే అవకాశం ఉంటుంది. అదే పాఠశాలల్లో ఎఎన్‌ఎంల నియామకం చేపడితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసే పరిజ్ఞానం వారికి ఉంటుంది. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎఎన్‌ఎంలకు అవగాహన ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలోనూ ఎఎన్‌ఎంల నియామకం చేపట్టలేదు. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలోనైనా జరుగుతుందనే ఆశ కనుచూపు మేరలో కనిపించడం లేదు.జ్వరంతో విద్యార్థిని మృతిగుమ్మలక్ష్మీపురం : మండలంలోని పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతిక అనే గిరిజన విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. విద్యార్థిని స్వగ్రామం మండలంలోని కె.శివడ. అవంతిక అనారోగ్యానికి గురవడంతో వైద్యం కోసం పార్వతీపురం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. తమ బిడ్డ అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి : సిపిఎంకొమరాడ : మండలంలో కెజిబివిలో 9వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి శారద మృతిపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం కొమరాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విద్యార్థుల మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోవడం దారుణమన్నారు. అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థి మృతి చెందిందని ఆవేదన వ్యక్తంచేశారు. శారద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. భవిష్యత్తులో గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టే విధంగా ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఆశలతో చేర్పిస్తే.. తమ పిల్లలు చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దే శంతో గిరి జనులు తమ పిల్లలను ఆశ్రమ పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఐదో తరగతి వరకు దగ్గరలో ఉన్న పాఠశాలల్లోనే చదివించుకుని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారనే నమ్మకంతో పిల్లలను వదిలి వెళుతుంటారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదు పాయాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో రక్షిత మంచినీటి సరఫరా చేసే ఆర్‌ఒ ప్లాంట్లు పని చేయడం లేదు. దోమల బారినుండి కాపాడే దోమతెరలను ఇంతవరకు పంపిణీ చేయలేదు. మూడేళ్ల క్రితం పంపిణీ చేసిన దోమ తెరలు చిరిగిపోయాయి. ఎఎన్‌ఎంల నియామకం నుంచి దోమతెరల పంపిణీ వరకు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.బాధితులకు పరిహారం చెల్లించాలి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతూ మృతి చెందిన విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షులు తాడంగి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంల నియామకానికి సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేసి మూడు నెలలు దాటిందని, ఇంతవరకు నియామకం లేదని చెప్పారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ పాపం ప్రభుత్వానిదేకొమరాడ : మన్యం జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు గిరిజన విద్యార్థులు మృతి చెందారని, ఈ పాపం ప్రభుత్వానిదేనని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు పళ్ల సురేష్ ఆక్షేపించారు. కొమరాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మంగళవారం కొమరాడ కెజిబివి విద్యార్థి కడ్రక శారద, బుధవారం గుమ్మలక్ష్మీ పురం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నిమ్మల అవంతిక డెంగీతో మృతి చెందారని తెలిపారు. నిత్యం జిల్లాలో గిరిజన విద్యార్థులు మరణిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.