ప్రజాశక్తి-సాలూరు : మున్సిపాలిటీలో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన పేర్లు మార్పునకు చెల్లించాల్సిన రుసుములను తగ్గిస్తూ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశం అజెండాలో ఉన్న అంశాలను ఆమోదించారు. ఏడాది క్రితం ఈ రుసుములను ఒక శాతానికి పెంచుతూ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆమోదం తెలిపిన తర్వాత కొంతమంది కౌన్సిలర్లు దీనిపై పునరాలోచనలో పడ్డారు. పట్టణ ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. దీంతోపాటు సాలూరు కంటే పెద్ద మున్సిపాలిటీలైన పార్వతీపురం, బొబ్బిలిలో 0.5 శాతం రుసుం వసూలు చేస్తుంటే ఇక్కడ ఒక శాతం వసూలు చేయడం సరైన నిర్ణయం కాదని ఆలోచించారు. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని కౌన్సిలర్లు భావించారు. దీంతో బుధవారం జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ సహకరించిన కమిషనర్ సత్యనారాయణని అభినందించారు. వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల బదలాయింపునకు 0.1 శాతం, క్రయవిక్రయాల ద్వారా సంక్రమించిన ఆస్తులకు 0.5 శాతం రుసుం విధించాలని నిర్ణయించారు.పారిశుధ్య నిర్వహణకు సంబంధించి కొనుగోలు చేసిన జెసిబి, కాంపాక్టు యంత్రాలను నడిపేందుకు డ్రైవర్లను ఎందుకు నియమించలేదని కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గొర్లి వెంకటరమణ, గిరి రఘు ప్రశ్నించారు. సుమారు రూ.50 లక్షలతో కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయని, వెంటనే సిబ్బంది నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. కమిషనర్ సత్యనారాయణ స్పందిస్తూ దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని, అనుమతి లభిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలోని కళ్యాణ మండపాలలో వివాహాలు నిర్వహించిన సందర్భంలో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలను వెంటనే తరలించడం లేదని, రెండు మూడు రోజులు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తోందని కౌన్సిలర్ బి.శ్రీనివాసరావు చెప్పారు. దీనిపై శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రాజీవ్ మాట్లాడుతూ వెంటనే వ్యర్థ పదార్థాలను తరలిస్తామని చెప్పారు. వాటర్ వర్క్స్ వద్ద పాడైన మోటార్‌కి బదులు కొత్త మోటార్ కొనుగోలు చేసేటప్పుడు సరైన గ్యారెంటీ ఉన్నవి కొనాలని, మే నెలలో శ్యామలాంబ పండుగ ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గిరి రఘు, గొర్లి వెంకటరమణ కోరారు. దీనిపై మున్సిపల్ డిఇ బివి ప్రసాద్ మాట్లాడుతూ గ్యారెంటీ ఉన్న మోటార్‌నే కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ జర్జాపు దీప్తి, కౌన్సిలర్లు జర్జాపు నీలిమ, బీషపు హైమవతి, వైదేహి కృష్ణారావు, ముసిడిపిల్లి సరోజిని, సింగారపు ఈశ్వరరావు, వరప్రసాద్, జి.నాగేశ్వరరావు, వైసిపి ఫ్లోర్ లీడర్ గొర్లి జగన్ మోహన్ రావు పాల్గొన్నారు.