ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్ : పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో సాగునీరు అందించే చిట్టిగెడ్డలో ఆక్రమణలను తొలగించాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్లబురిడి సాయిగడ్డపై అడ్డుకట్ట వేసి చిట్టిగెడ్డ ద్వారా లచ్చరాజుపేట, బందలుప్పి, పులిగుమ్మి గ్రామాలకు చెందిన రైతులు సుమారు 300 ఎకరాలలో సాగుచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమి గుండా వెళ్తున్న ఈ గెడ్డను గ్రామానికి చెందిన మాజీ విఆర్‌ఒ ఒకరు ఆక్రమించుకొని, గెడ్డకు చెందిన బట్టిని కప్పేసి రైతుల పొట్ట కొట్టారని అన్నారు. తరతరాలుగా రైతులు ఉపయోగించుకుంటున్న ఈ కాలువను కప్పేయడం చట్ట విరుద్ధమైన చర్యని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. తక్షణమే చిట్టిగెడ్డపై ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి రైతులకు సాగునీరు ఇవ్వాలని కోరారు. సాకిగెడ్డపై చెక్‌డ్యామ్ నిర్మించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బంటు దాసు, రైతులు పాల్గొన్నారు.
