ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదు. విద్యార్థులకు సకాలంలో కల్పించాల్సిన సౌకర్యాలు, స్కాలర్‌షిప్, డైట్ బిల్లులు చెల్లించడంలో ఎప్పుడూ వెనుకబాటే. కానీ, విద్య కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని మాత్రం బాకాలూదుతున్నారు. ఆశ్రమ పాఠశాలలకు, వసతిగృహాలకు నెలలు తరబడి బిల్లులు అందకపోవడంతో డిప్యూటీ వార్డెన్లు, వసతిగృహ అధికారులు, పాఠశాలల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. డిసెంబర్ నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి వసతిగృహాలు నడిపిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాశక్తి-సీతంపేట: సీతంపేట ఐటిడిఎ పరిధిలో 47 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 16 పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు, కెజిబివి, గురుకుల పాఠశాలలు.. మొత్తం.. 71 విద్యాసంస్థల్లో సుమారు 20 వేల మంది విద్యనభ్యశిస్తున్నారు. 3, 4 తరగతులకు రూ.1050, 6, 7 తరగతులకు రూ.1250, 8, 9, 10 తరగతులకు రూ.1450 చొప్పున నెలకు మెస్‌ఛార్జీల కింద ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఛార్జీలతో ఆదివారం గోధుమ పూరి, బంగాళదుంప కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, 10 గంటలకు వేరుశనగ చిక్కి, మధ్యాహ్నం ఒంటిగంటకు చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ, రాత్రి ఏడున్నరకు అన్నం, సాంబారు, మజ్జిగ, కూర, అరటిపండు పెట్టాలి. సోమవారం ఉదయం ఏడు గంటలకు పాలు, 8 గంటలకు పులిహోరా, శనగపప్పు పొడి, ఉడకబెట్టిన గుడ్డు, పదిన్నరకు వేరుశనగ చిక్కి, మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నం, గోంగూర పప్పు, కూరగాయలతో కూర, పెరుగు, నాలుగున్నరకు ఉడికించిన బఠానీ గుగ్గిళ్లు, రాత్రి భోజనంలో అన్నం, క్యాబేజీ కూర, రసం, మజ్జిగ, జామ్ పెట్టాలి. ఇలా వారానికి రెండుసార్లు చికెన్, ఆరు రోజులు గుడ్డు, ప్రతిరోజు ఇడ్లీ, పూరి, కిచిడి, పాలు, ఆదివారం బిర్యానీ… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఇచ్చిన మెస్‌ఛార్జీలు తక్కువేనని చెప్పొచ్చు. దాంతోపాటు పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో టీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏఒక్కటి కొరత వచ్చినా, సరిగా మెనూ అమలు చేయడం లేదంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు కస్సుబుస్సు లాడటం, మెమోలివ్వడం సర్వసాధారణమే. కానీ మెస్‌ఛార్జీల గురించి మాత్రం వారెవరూ పట్టించుకోవడం లేదు.నెలల తరబడి పెండింగ్‌ఇచ్చిన అరకొర మెస్‌ఛార్జీలను కూడా ప్రభుత్వం సరిగా విడుదల చేయడం లేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల డైట్ బిల్లులు అందకపోవడంతో హెచ్‌డబ్ల్యుఒలు, డిప్యూటీ వార్డెన్లు, వసతిగృహాల నిర్వాహకులు అప్పులు చేసి నిర్వహణ సాగిస్తున్నారు. విద్యార్థులకు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కారం రెడ్‌చిల్లి, తెల్లఉల్లి, బెంచి రవ్వ, ఆయిల్, మినప గుళ్లు తదితర సరుకులు సరఫరా చేస్తున్నారు. మిగతా కూరగాయలు, చికెన్ వంటివి బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ మాత్రం ఏజెన్సీ కార్యాలయంలో ముందుగా నగదు చెల్లిస్తేనే గ్యాస్ డెలివరీ చేస్తారు. లేదంటే చెయ్యరు. దీంతో వసతిగృహాల నిర్వాహకులు నిర్వహణకు అప్పులు చేసి నడపడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతినెలా బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు.ఎటిడబ్ల్యుఒ వివరణడైట్ బిల్లుల గురించి ఎటిడబ్ల్యుఒ జి.మంగవేణి వద్ద ప్రస్తావించగా, నవంబర్ వరకు బిల్లులు చెల్లించామని చెప్పారు. మూడు నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆర్‌బిఐ నుంచి విడుదల చేయాల్సి ఉందని సమాధానం ఇచ్చారు.