ప్రజాశక్తి – సీతానగరం/పార్వతీపురంరూరల్ : పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో చేపట్టే సిసి, బిటి రోడ్ల నిర్మాణాల నాణ్యతలో రాజీ పడొద్దని ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండలం హెచ్.కారాడవలసలో సిసి రోడు, సీతానగరం మండలం నిడగల్లు నుంచి జగన్నాధపురం వరకు వేస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం సీతానగరం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ కార్యక్రమాల ప్రగతి గురించి సమీక్షించారు. ఐటిడిఎ పరిధిలో నిర్మించే రహదారి పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీపడరాదని, పక్కాగా నిర్మించాలని సూచించారు. జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించిన ఆయన అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
