4 నెలలుగా జీతం లేదు… న్యాయం చేయండి

Feb 1,2025 20:59

పార్వతీపురం: నాలుగు నెలలుగా తనకు జీతం బిల్లు పెట్టలేదని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తనకు న్యాయం చేయాలని గిరిజన పంచాయతీ కార్యదర్శి ఎం.బాలాకుమారి రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు ని వేడుకున్నారు. శనివారం ఆమె విజయనగరంలో ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ శంకరరావు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వీరఘట్టం మండలం చిన్న గోర కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న తనకు నాలుగు నెలలుగా జీతం బిల్లు పెట్టడం లేదని చెప్పారు. పంచాయితీ కార్యదర్శుల బదిలీల్లో భాగంగా తనకు మొదట భామిని మండలం బదిలీ చేశారని, తాను ఆ గ్రామంలో చేరలేదని చెప్పారు. ఎంపిడిఒ కూడా తనకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇవ్వలేదని తెలిపారు. అయితే రివైజ్డ్‌ బదిలీల్లో తనకు వీరఘట్టం మండలం చిన్న గోర కాలనీ పంచాయతీకి బదిలీ చేశారని, అక్కడ చేరానని చెప్పారు. అయితే చిన్నగోర కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన కె.సునీల్‌ కుమార్‌కు వంగర మండలం బదిలీ చేశారని, ఆయన అక్కడ విధుల్లో చేరాలని తెలిపారు. మూడు రోజుల తర్వాత వంగర మండలం బదిలీ అయిన సునీల్‌ కుమార్‌ని మళ్లీ చిన్న గోర కాలనీ పంచాయతీకి బదిలీ చేశారని, ఆయన్ను ఎంపిడిఒ విధుల్లో చేర్చుకున్నారని చెప్పారు. అయితే గత నాలుగు నెలలుగా తనకు జీతం బిల్లు పెట్టకుండా సునీల్‌ కుమార్‌కు జీతం బిల్లు పెడుతున్నారని చెప్పారు. తనను మరో పంచాయతీకి బదిలీ చేయలేదని, నాలుగు నెల లుగా గాలిలో పెట్టారని చెప్పారు. తనకు రెండేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ పోషణ తన పైనే వుందని చెప్పారు. తనకు జీతం ఇప్పించి చిన్న గోర కాలనీ పంచాయతీ కార్యదర్శిగా కొనసాగేలా చూడాలని కోరారు. దీనిపై కమిషన్‌ చైర్మన్‌ శంకరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం, మన్యం జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు.

➡️