హక్కులకు భంగం కలిగించొద్దు

Dec 10,2024 22:11

ప్రజాశక్తి-పార్వతీపురం : ఆర్టికల్‌ 26 ప్రకారం ఒకరి హక్కులకు మరొకరు భంగం కలిగించకూడదని రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్‌.దామోదరరావు తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ కళాశాల మృత్యుంజయ అడిటోరియంలో సెట్విజ్‌ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవాలని సూచించారు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రతిఒక్కరూ ఉచిత విద్యను పొందే హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. చదువుకోవడానికి స్థానికత అవసరం లేదన్నారు. హక్కుల కోసం పోరాడాలని, లేకపోతే బానిసలుగా బతకాల్సి వస్తుందని చెప్పారు. ఐటిడిఎ పిఒ అశుతోష్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ బాలకార్మికులను ప్రోత్సహించకూడదని చెప్పారు. బాల్య వివాహాలు నేరమని, వాటికి చట్టంలో కఠిన శిక్షలు అమలవుతున్నాయని తెలిపారు. అదనపు ఎస్‌పి ఒ.దిలీప్‌ కిరణ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సోషల్‌ మీడియాలో చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సోషల్‌ మీడియాలో వ్యక్తుల హక్కులకు భంగం కలిగించేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది జోగారావు, సెట్విజ్‌ సిఇఒ, జిఎస్‌డబ్ల్యుఒ బి.రాంగోపాల్‌ వర్మ, ఎబి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎం.ఎస్‌. స్వరూప్‌, ఎపి మానవ హక్కుల కమిటీ జనరల్‌ సెక్రటరీ పి.సంతోష్‌, కోచ్‌ అశ్విని, దినేష్‌, ఎన్‌.టి.ఆర్‌ ట్రస్ట్‌ సభ్యులు ఎం.అప్పారావు పాల్గొన్నారు.పార్వతీపురంటౌన్‌ : ప్రతిఒక్కరూ మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ జి శ్రీనివాసరాజు, పట్టణ సిఐ మురళీధర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలో పాత బస్టాండ్‌ వద్ద జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వలిరెడ్డి జగదీష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం స్థానికులకు ఆహార పొట్లాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా లీగల్‌ అడ్వైజర్‌ మజ్జి వెంకటేష్‌, ఉపాధ్యక్షులు గేదెల సర్వేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, వావిలపల్లి సూర్యనారాయణ, సభ్యులు గొర్లి రామకృష్ణ, కురుమోజు గణేష్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

➡️