ప్రజాశక్తి-సీతానగరం : జిల్లాలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ రైతులకు హామీఇచ్చారు. దళారుల మాటలు విని మోసపోవద్దని కోరారు. బుధవారం సీతానగరం మండలం అంటిపేట గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబికతో కలిసి కలెక్టర్ పర్యటించారు. అక్కడ రైతులతో ధాన్యం కొనుగోళ్ల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతుకు అవసరమైన గన్నీ బ్యాగులు, రవాణా, హమాలీ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రైతులు ధాన్యం విక్రయించినట్లు రశీదు అందజేస్తామని, రశీదు ఇచ్చిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో నగదు జమ అవుతుందని కలెక్టర్ వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. రైతులు ఇచ్చిన కొలత మేరకే మిల్లర్లు తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అల్పపీడన ద్రోణితో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉండవచ్చని, పండించిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకొని, సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్ పాల్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రంలో తనిఖీలు మండలంలోని గుచ్చిమి రైతు సేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెసి ఎస్.ఎస్. శోబిక బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను ఆమె పరిశీలించారు. ఎఒ, విఎఎ, రైతు సేవా కేంద్రం సిబ్బందికి పలు సూచనలు, మార్గదర్శకాలు జారీచేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లు, సంబంధిత అధికారులతో జెసి సమీక్షించారు. రైతులకు గోనె సంచులు అందించాలి రైతులకు సకాలంలో గోన్ సంచులు అందించాలని ఎపి రైతు సంఘం నాయకులు రెడ్డి లక్ష్మునాయుడు, బోరపరెడ్డి అప్పారావు, బి.నారాయణస్వామి, ఆర్.ఈశ్వరరావు కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జెసి శోబికను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా రైతులకు గోనె సంచులు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదన్నారు. రవాణాకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుల వద్ద నుంచి మిల్లర్లు బస్తాకు 4 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టకూడదుబలిజిపేట : ఏ ఒక్క కారణంతోనైనా రైతులు ఇబ్బంది పడకూడదని జాయింట్ కలెక్టర్ శోబిక అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మిల్లర్లు, కస్టోడియన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు దగ్గర నుండి రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవరకు ఏ అధికారైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.