ప్రజాశక్తి-మక్కువ : ఎవరో రెచ్చగొడుతున్నారని సర్పంచులు కోర్టుకు వెళ్లి పనులను అడ్డుకోవాలని చూస్తే అభివృద్ధి ఆగిపోతుందని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి జి.సంధ్యారాణి తెలిపారు. అధికారులను బెదిరిస్తూ అభివృద్ధి పనులకు అడ్డు తగిలితే చూస్తూ ఊరుకోబోమని వైసిపి నేతలు, సర్పంచులను పరోక్షంగా హెచ్చరించారు. బుధవారం మండలంలో శంబర గ్రామంలో రూ.2.41 కోట్లతో చేపట్టే ఆరు రోడ్ల పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం సావిడివీధిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వైసిపి నాయకత్వం జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. వండర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది గత ప్రభుత్వమేనని, ఇప్పుడు వారు దాన్ని తప్పుపడుతూ పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్, సర్పంచ్ సింహాచలమమ్మ, టిడిపి మండల అధ్యక్షులు జి.వేణుగోపాల్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.పిలిచినట్టే పిలిచి… ఆహ్వానం మరిచిటిడిపిలో ఇంకా ఎడమొహం, పెడ మొహం జాడ్యం పోలేదన్నది శంబర కార్యక్రమంలో తేటతెల్లమైంది. పెద్దఎత్తున శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయంటూ మండలమంతా నాయకత్వానికి కబుర్లు పంపారు. శంకుస్థాపన అనంతరం వేదిక వద్దకు కొంతమందిని ఆహ్వానించకపోవడం గమనార్హం. పేరు పెట్టి పిలవకుండా మక్కువ నాయకులు వేదిక ముందుకు రావాలని పిలవడం ఇక్కడ గమ్మత్తుగా మారింది. అధ్యక్షుడికి నచ్చిన వారి పేరు పిలవడం వల్ల స్టేజ్ వరకు వచ్చి కొంతమంది కిందనే ఉండియారు. సీనియర్ నాయకులు మావూడి ప్రసాద రామ్ నాయుడు మాత్రం వెనుతిరిగి వెళ్లిపోయారు. మత్స్యసంపద వృద్ధి చెందాలి జిల్లాలోని మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో మత్స్య సంపద వృద్ధి చెందాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా వెంగళరాయ జలాశయంలో చేప పిల్లలను వదిలే కార్యక్రమం మత్స్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు. విజయనగరం ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నుంచి తెచ్చిన మూడు లక్షల చేప పిల్లలను జలాశయంలోకి మంత్రి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు చేపల పెంపకంపై మరింత దృష్టి సారించాలని కోరారు. మత్స్య సంపదతో వారికి ఉపాధి అవకాశాలే కాకుండా ఆర్థికంగా ఎదిగేందుకు దోహద పడుతుందని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఎస్‌టి జీవనోపాదికి అవసరమైన వేట పరికరాలు, వలలు, బోట్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు వంటి వాటిని పార్వతీపురం ఐటిడిఎ నుంచి మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలా కుమారి, పార్వతీపురం జిల్లా మత్స్యశాఖాధికారి వేముల తిరుపతయ్య, సాలూరు మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఎల్లేటి శ్రీదేవి, శంభర ఎంపిటిసి తియ్యాల పోలినాయుడు, మాజీ సర్పంచ్ అక్యాన తిరుపతి రావు, అన్నంరాజువలస సర్పంచ్ చీమల రాములమ్మ, ఉమ్మడి విజయనగరం జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు బర్రి చిన అప్పన్న, చినచీపురువలస మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సురపాటి ఆదినారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.