బురద నీరు వద్దు.. మంచినీరు కావాలి

Oct 1,2024 21:26

ప్రజాశక్తి- పార్వతీపురం : పట్టణానికి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? అని ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి విమర్శించారు. పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారానికై ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ పట్టణం జిల్లా కేంద్రమైన తర్వాత మరింత రెట్టింపుల్లో జనాభా పెరిగిందని, అయితే వారి అవసరాలకు తగ్గ సౌకర్యాలు లేవన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్‌, జిల్లా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. పట్టణానికి తాగునీటి సరఫరా చేసే పంపులు, పైపులు, బేవర్‌ కెడ్‌ ,ట్యాంక్‌ సైజులు పెరగలేదని ఈ విధమైన పరిస్థితి ఉంటే నీటి అవసరాలు ఏ విధంగా తీర్చగలరని ప్రశ్నించారు. ఇది ప్రజల పట్ల ప్రభుత్వం దారుణ నిర్లక్ష్యంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వారానికి రెండు, మూడు రోజులు నీటి సరఫరా చేస్తున్నారని, ఒక్కొక్కసారి పూర్తిగా రెండు వారాలకు ఒకసారి మాత్రమే అందిస్తున్నారని, అది కూడా బురద నీరు సరఫరాచేయడం అమానుషమని మండిపడ్డారు. పన్ను మాత్రం క్రమం తప్పకుండా మున్సిపాలిటీ అధికారులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం ఐద్వా నాయకులు రెడ్డి శ్రీదేవి, వి.ఇందిరా మాట్లాడుతూ పట్టణ ప్రజలు మంచి నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని, బురద నీరు తాగుతుండడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ఉన్నతాధికారుల్లో ఎటువంటి చలనంలేదని విమర్శించారు. పట్టణ ప్రజల తక్షణ అవసమేగాక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటిని పట్టణానికి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయించాలని, తాగునీటి సరఫరా షెల్టర్‌ను ఆధునీకరించాలని, ప్రతిరోజు శుద్ధి చేసిన నీటిని ఇవ్వాలని, కొత్తగా వెలసిన కాలనీలకు, అపార్ట్మెంట్లకు తాగునీటి కలెక్షన్‌ డిమాండ్‌ చేశారు. అలాగే చిట్లి పోయిన పైపులైన్లకు, జనరల్‌ పబ్లిక్‌ కుళాయిలకు మరమ్మతులు చేసి నీటి వృథాను ఆపాలని, ట్యాంకులతో సరఫరా చేసే ప్రాంతాలకు, కాలనీలకు రెగ్యులర్‌ గా ట్యాంకర్లను పంపేలా చర్యలు తీసుకోవాలని, కనెక్షన్లు ఉండి నీరు ఇవ్వని వారి నుండి నీటి పన్ను వసూలు చేయరాదని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఆర్‌ఒ జి.కేశవ నాయుడుకు వినతిపత్రాన్ని అందిం చారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు బంటు దాసు, సిఐటియు జిల్లా కోశాధికారి జి వెంకటరమణ, సిఐటియు నాయకుడు బి.సూరిబాబు, పి.రాజశేఖర్‌, లక్ష్మీపతిరాజు, ఐద్వా పట్టణ కమిటీ నాయకులు జి.తులసి, ఎం.గౌరి, కె. భవాని, జ్యోతి, జయ్యమ్మ, పి. ఉమా, రావనమ్మ, మంగ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️