ప్రజాశక్తి – వీరఘట్టం: తరాలు మారినా మా గ్రామాన్ని మాత్రం తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది. పాలకులు, అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప కనీస చర్యలు చేపట్టకపోవడంతో సమస్య సమస్యగానే మిగిలిపోతుందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని గడగమ్మ గ్రామస్తులు. మండల కేంద్రమైన వీరఘట్టంకు కూత వేట దూరంలో ఉంది గడగమ్మ గ్రామం. ఈ గ్రామంలో 261 గృహాలు, సుమారు 1144 మంది జనాభా నివాసం ఉంటున్నారని అధికార గణాంకాలు చెబుతున్నాయి. గ్రామంలో పది బోరు బావులు ఉన్నాయి. అందుబాటులో ఏ విధమైన చెరువులు లేవు.నాగావళి నది చెంతకు పరుగులుగ్రామంలో బోరుబావులున్నప్పటికీ వాటి ద్వారా వచ్చే నీరు తాగేందుకు పనికి రావడం లేదని, గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న నాగావళి నది చెంతకు వెళ్లి చలమల ద్వారా నీడు తోడుకుని తీసుకువచ్చి దాహార్తిని తీర్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల వ్యాధులబారిన పడినప్పటికీ నది నీరు తెచ్చుకొని కాలం గడుపుతున్నట్లు గడగమ్మ గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి పక్కనే నది ఉన్నప్పటికీ తాగేందుకు నీరు రాకపోవడంతో తాగునీటి కోసం కష్టాలు తప్పడం లేదని, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపయోగంగా పడి ఉన్న బోరుబావులగ్రామంలోని పంచాయతీ కార్యాలయం, పాఠశాలకు ఎదురుగా గత ఏడాది లక్షలాది రూపాయలతో జలజీవన్ మిషన్ పథకం కింద రెండు బోర్లు తవ్వారు. వీటి ద్వారా ఇంటింటికి తాగునీరిచ్చేందుకు కుళాయి పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. పనులు చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రామంలో అవి నిరుపయోగంగా పడి ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. బోరు బావులతో పాటు ఇంటింటికీ కుళాయి పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. రోజులు గడుస్తున్నా వీటి ద్వారా చుక్క నీరు రాకపోవడంతో గ్రామంలో అవి ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో తవ్వకాలు జరపడంతో ఎట్టకేలకు గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కార మవుతుందని, సంబ రపడ్డ గ్రామస్తులకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని గడగమ్మ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ డి.కావ్యశ్రీ వద్ద ‘ప్రజాశక్తి’ ప్రస్తావించగా జలజీవన్ మిషన్ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లేక నిలిచిపోయాయని, అంతేకాకుండా గ్రామంలో ఉన్న బోరు బావుల నుంచి వచ్చే నీరు తాగేందుకు అనువుగా ఉంటుందని, వీటికి సంబంధించి నీటి పరీక్షలు కూడా చేశామని తెలిపారు.
