తాగునీటి సమస్య పరిష్కరించాలి

Mar 13,2025 21:02

పాచిపెంట: తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని కేసలి పంచాయతీ కుమ్మరివలస గిరిజనులు గురువారం స్థానిక సిపిఎం నాయకులు దీసరి వసంతరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్వై నాయుడు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ అనేక సమస్యలతో గిరిజనులు బాధలు పడుతున్నారని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా కష్టాలు పడుతున్నారని, కలుషితమైన చలమ, ఊట నీరు తాగి రోగాలతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల గిరిజనులకు తాగునీరందని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మరికొద్ది రోజుల్లో గ్రామం వద్ద గెడ్డ ఎండిపోయి చలమ నీరు కూడా అందని పరిస్థితి నెలకొందని, కావున వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి కుమ్మరవలసలో చేతిపంపు వేయాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ 8నెలల క్రితం తాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టినా అధికారులు స్పందించలేదని, ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. పాడైన మోటార్‌ను బాగు చేసి ట్యాంకు ద్వారా తాగునీరందించేలా చర్యలు చేపట్టాలని, లేకుంటే దీనిపైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు కోడికాల లక్ష్మి, వరాలమ్మ, పార్వతి, సుశీలతో పాటు. స్థానికులు లక్ష్మణరావు, జన్ని నాగరాజు, దీసర బుచ్చియ్య, కోడికాల త్రినాధ తదితరులు పాల్గొన్నారు.

➡️