కురుపాం: విద్యార్థుల విద్య, ఆరోగ్యం ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి.కాంతారావు అన్నారు. గురువారం ఆయన కురుపాం, పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని హాస్టళ్లను, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కురుపాంలో గల అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్, మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్ వాహనం ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక మండల పరిషత్తు పాఠశాల ఆవరణంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనం ద్వారా అందిస్తున్న సరుకుల పంపిణీని పరిశీలించారు. సరుకుల పంపిణీలో కొలతలు ఏమైనా తేడా ఉన్నదా, ఎంత మేర సరుకులు నిల్వ ఉన్నవి తదితర అంశాలపై పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో స్టోర్ రూమ్‌లో సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, కోడిగుడ్ల నిల్వలు సక్రమంగా ఉన్నవీ లేనిదీ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషక ఆహారాన్ని, వంటకాలను ఆహార భద్రతాధికారి వై.రామయ్యతో తనిఖీలు నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. రక్తహీనత నివారణకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి అదనపు పౌష్టికాహార కిట్లను అందిస్తున్నందున చిత్తశుద్ధితో పనిచేసి రక్త హీనత బాధితుల సంఖ్య తగ్గించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. విద్యార్థులకు ఆకు కూరలు, సాంబార్లో క్యారెట్ ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను సందర్శించారు. కందిపప్పు, బియ్యం, పంచదార, పామాయిల్ సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. రిజిస్టర్‌లోని సరుకుల వివరాలు, గోదాంలోని సరుకులు తూనిక ప్రకారం సరిపడా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ నుంచి మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంటకాలను రుచి చూశారు. స్వయంగా విద్యార్థులను వడ్డించి ప్రతిరోజూ మెనూ ప్రకారం సక్రమంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. అనంతరం గర్భిణీలకు, బాలింతలకు అదనపు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాసరావు, జిసిసి డిఎం మహేంద్ర కుమార్, ఐసిడిఎస్ పీడీ టి.కనకదుర్గ, వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్‌రావు, తూనికలు, కొలతల అధికారి కె.రత్నరాజు, ఎంఇఒ ఎన్.సత్యనారాయణ, ఎబిడబ్ల్యుఒ ఇ.అప్పన్న, ఎఎస్‌డబ్ల్యుఒ పి.రాణి, సిడిపిఒ ఆర్.విజయ గౌరీ, తదితరులు పాల్గొన్నారు.