ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

Feb 9,2025 21:48

ప్రజాశక్తి-బొబ్బిలి : తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పిడిఎఫ్‌ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి తెలిపారు. ఆదివారం బొబ్బిలి పట్టణంలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాల నుంచి విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్నాన న్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు విద్యారంగ, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పటికే ఆయా సమస్యల పరిష్కారానికి పోరాటం చేశానని, ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గళం వినిపిస్తానని చెప్పారు. ప్రయివేట్‌ విద్యాసంస్థలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లకు సంక్షేమ నిధి కేటాయించాలని, హెల్త్‌ కార్డులు మంజూరు చేసి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆమె ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లను కోరారు. ఆమెతో యుటిఎఫ్‌ నాయకులు ప్రసన్నకుమార్‌, కేశవరావు ఉన్నారు.

➡️