ప్రజాశక్తి – పార్వతీపురం/బలిజిపేట : ఉపాధి హామీ పనుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సెగలు రేగుతున్నాయి. ఈ చట్టంలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా పంచాయతీ సర్పంచుల ద్వారా పనులు జరగాలని వైసిపికి చెందిన ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపిపి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మెజారిటీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు ఉపాధి హామీ చట్టం ప్రస్తావనకు వచ్చినప్పుడు గళమెత్తారు. గ్రామసభలు నిర్వహించి, పనులు ఆమోదించారని, ఇప్పుడు అవే పనులు కాంట్రాక్టర్లతో చేయించడం సబబు కాదని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్పంచులు, ఎంపిటిసి సభ్యులకు టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఇదేనా అని నిలదీశారు. వైసిపి సభ్యులు మాట్లాడుతున్నంత సేపు ఎమ్మెల్యే బి.విజయచంద్ర మౌనం దాల్చారు. ఇంతలో సమావేశంలోకి సభ్యులు కాని కొంతమంది టిడిపి నాయకులు ప్రవేశించి సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఎంపిపి, జెడ్పీటీసీలను కించపరుస్తూ మాట్లాడారు. ఇది భరించలేని సర్పంచులు ఎంపిటిసి సభ్యులు ఎంపిపి, జెడ్పీటీసీలు సమావేశం బహిష్కరించారు. ఎమ్మెల్యే విజయచంద్ర సమక్షంలోనే టిడిపి నాయకులు అవమానిస్తున్నా ఆయన కనీసం ఖండించలేదని బహిష్కరించిన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులంతా సమావేశాన్ని బహిష్కరిస్తే ఎమ్మెల్యే అధికారులతో ఎలా సమావేశాన్ని నిర్వహిస్తారని ప్రశ్నించారు.సర్పంచుల ద్వారా చేయాలని రూల్ లేదు: ఎమ్మెల్యేఉపాధి హామీ పనులు పంచాయతీ సర్పంచ్‌ల ద్వారా చేయాలనే నిబంధన ఎక్కడా లేదనీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. అందరూ కలిసి చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు.బారు కట్ చేసిన ఎంపిపి, జెడ్‌పిటిసి, సర్పంచులు సర్వసభ్య సమావేశం అంటే గతంలో మూడు నెలలలో జరిగిన అభివృద్ధి, మిగతా మూడు నెలల్లో జరగబోయే అభివృద్ధి గురించి చర్చించడం, సంబంధిత అధికారులు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు ఆయా సమస్యలపై అడగడం జరగాలి. కానీ బలిజిపేట మండలంలో దీనికి విరుద్ధంగా సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగిందని ఎంపిపి జి.నాగమణి, జెడ్‌పిటిసి సభ్యులు ఎ.రవికుమార్ అన్నారు. ఈ మేరకు విలేకరులతో వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంపై చర్చ జరుగుతుండగా కొంతమంది ఇతర వ్యక్తులు సర్వసభ్య సమావేశంలోనికి చొరబడి రౌడీల్లా ప్రవర్తించారని అన్నారు. ఎంపిపి, జెడ్‌పిటిసి మాటకు విలువ లేకుండా నచ్చినట్లు సర్వసభ్య సమావేశం జరగకుండా చేశారని తెలిపారు. జరుగుతున్న సన్నిశాన్ని ఎమ్మెల్యే, అధికారులు చూస్తున్నప్పటికీ వారిని పంపించడంలో గానీ, వారికి సద్ది చెప్పడంలోని ఎటువంటి ప్రయత్నం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమావేశం నుంచి మాతో పాటు ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్‌లు బారుకట్ చేశామన్నారు. అనంతరం ఎంపిపి అధ్యక్షతన లేకుండా ఎమ్మెల్యే, మండల అధికారులు సమావేశం నిర్వహించారన్నారు. ఎన్నడూ లేని విధంగా అధికారులు ముందు ప్రజాప్రతినిధులను అగౌరపరచడం దుర్మార్గమన్నారు. ఇటువంటి రౌడీ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు.