అంతర్రాష్ట్ర వివాదాలపై అంతులేని నిర్లక్ష ్యం

Jan 13,2025 20:16

ప్రజాశక్తి-పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు అంతర్రాష్ట్ర వివాదాలపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. దశాబ్దాలు గడుస్తున్నా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పాలకులు చొరవ చూపించని పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలెన్ని మారినా ఈ వివాదాల పరిష్కారానికి కనీస చొరవ చూపడం లేదు. ఎన్నికల ముందు హామీలిస్తూ గెలిచిన తరువాత గాలికొదిలేయడం జిల్లా పాలకులకు అలవాటుగా మారింది.జిల్లాలో సుదీర్ఘ కాలంగా కొటియా గ్రామాల వివాదం, జంఝావతి జలవివాదాలు పొరుగునున్న ఒడిశా ప్రభుత్వంతో ఉన్నాయి. ఎపి, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వాలున్నాయి. గతంలో వేర్వేరు ప్రభుత్వాలు ఉన్న కారణంగా పాలక పక్షాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేంద్రంలో, ఒడిశా, ఎపిలో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వాలు ఏర్పడటంతో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు వివాదాలు పరిష్కారమైతే మన్యం జిల్లాకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. 21 గిరిశిఖర గ్రామాలకు సంబంధించిన కొటియా వివాదం ఆరు దశాబ్దాలుగా ఉంది. ఈ గ్రామాల్లో విలువైన ఖనిజ సంపద ఉండటంతో ఒడిశా ప్రభుత్వం ఆ గ్రామాలు తమవేనని వాదిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా కయ్యానికి కాలు దువ్వుతోంది. కొటియా గ్రామాలపై పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే రెండు, మూడు గ్రామాలు తప్ప మిగిలిన గ్రామాలన్నీ ఎపిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆంధ్రాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవనోపాధికి మేలు చేస్తున్నాయని గిరిశిఖర గ్రామాల గిరిజనులు భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు కొటియా గ్రామాలలో ఎపి, ఒడిశా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేవి. అయితే గత మూడు సంవత్సరాలుగా ఆ గ్రామాలపై పెత్తనం చెలాయించేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో గిరిజనులు నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ గ్రామాల్లో ఎపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒడిశా దూకుడుగా వ్యవహరిస్తున్నా ఎపి ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతూ వస్తోంది. సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంధ్యారాణి ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది. అయినా ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్న దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మంత్రి సంధ్యారాణి కొటియా గ్రామాల వివాదంపై హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు.నాలుగున్నర దశాబ్దాలుగా జంఝావతిపై నిర్లక్ష్యంజిల్లాలో అతి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టు జంఝావతి. గత 45 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోలడం వెనుక పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఎమ్మెల్యేలెందరు మారినా ఈ ప్రాంత రైతుల కల సాకారం కావడం లేదు. ఎన్నికల హామీగానే మిగులుతోంది. ఒడిశాతో ఉన్న జలవివాదం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉంది. ఇప్పుడు ఒడిశా, ఎపిలో ఎన్‌డిఎ ప్రభుత్వాలు అధికారంలో వున్నాయి. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు చర్చలు జరిపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సిఎం జగన్‌, ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌తో భువనేశ్వర్‌లో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో జంఝావతి, కొటియా గ్రామాల వివాదాలపై చర్చించారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఆ చర్చల సారాంశం బయటకు రాలేదు. వేలాది మంది రైతులకు సంబంధించిన జంఝావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం ఒడిశాతో వివాదాన్ని సాకుగా చూపి స్థానిక పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా సిపిఎం, ఎపి రైతుసంఘం పోరాడుతున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రైతు, ప్రజాసంఘాల నాయకులు జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో పర్యటించి స్థానిక సర్పంచుల తీర్మానాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఇంత జరుగుతున్నా జిల్లాకి చెందిన మంత్రి గాని, ఎమ్మెల్యేలు గాని నోరు మెదపడం లేదు. ఈ రెండు అంతర్రాష్ట్ర వివాదాలపై అంతులేని నిర్లక్ష్యంతో గిరిజనులు, రైతులను పాలక పార్టీలు మోసం చేస్తున్నాయి.

➡️